కలం, నిజామాబాద్ బ్యూరో: బియ్యం ధరలను నియంత్రించేందుకు రైస్ మిల్లర్లు, బియ్యం వ్యాపారులు, ట్రేడర్లు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) సూచించారు. బియ్యం నిల్వలు, సరఫరా, విక్రయాల విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించి బియ్యం ధరలను పెంచేందుకు ప్రయత్నించినా, అక్రమ నిల్వలకు పాల్పడినా సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల అతిక్రమణకు పాల్పడే ట్రేడర్ల లైసెన్సులు రద్దు చేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో బుధవారం రైస్ మిల్లర్లు, ట్రేడర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. స్వేచ్ఛ విపణిలో బియ్యం ధరలు, వాటి క్రయ విక్రయాలు, సన్న బియ్యం సేకరణ స్టాక్ వివరాలు తదితర అంశాలపై వారితో చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యావసరమైన బియ్యం ధరలు అందుబాటులో ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. మార్కెట్‌లో బియ్యం లభ్యత, ధరల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ బియ్యం క్రయ విక్రయాలలో ఎలాంటి అంతరాయాలు ఏర్పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రేడర్లు పాల్గొన్నారు.

