కలం, వెబ్ డెస్క్: అర్హులైన డెస్క్ జర్నలిస్టులందరికీ (Desk Journalists) అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన 252 జీవోను రద్దుచేసి గతంలో ఇచ్చిన మాదిరిగానే జర్నలిస్టులందరికీ న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం డెస్క్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో టీడబ్ల్యూజేఎఫ్, టీయూడబ్ల్యూజే(143), కేబుల్ నెట్వర్క్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సంఘాల ప్రతినిధులు హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి.. డెస్క్ జర్నలిస్టులందరికీ న్యాయం జరగాలంటూ స్లోగన్స్ చేశారు. అనంతరం తెలంగాణ మీడియా అకాడమీ వరకు ర్యాలీ నిర్వహించారు.
అకాడమీ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. మీడియా అకాడమీ సెక్రటరీకి వినతి పత్రం అందజేసి తమ డిమాండ్లు తెలియజేశారు. ఈ సందర్భంగా డెస్క్ జర్నలిస్టుల సంఘం ప్రెసిడెంట్ బాదిని ఉపేందర్ మాట్లాడుతూ.. సవరణ జీవో 252 ప్రకారం అక్రిడేషన్లు జారీ చేస్తే డెస్క్ జర్నలిస్టులు అన్యాయానికి గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రిడేషన్లు తగ్గించడం అంటే జర్నలిస్టులకు సంక్షేమాన్ని దూరం చేయడమే అవుతుందని అన్నారు. జర్నలిస్టులకు ఇస్తున్న హెల్త్ కార్డులు అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సర్క్యులేషన్ నిబంధన ఎత్తేయాలి
ఒక్కో ఎడిషన్ సెంటర్లో నాలుగైదు జిల్లాల డెస్కులు ఉన్నాయని, వారందరికీ జిల్లాకు నాలుగు చొప్పున ఎడిషన్ సెంటర్ల పరిధిలోని అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. అర్హత కలిగిన ఏ ఒక్క డెస్క్ జర్నలిస్టుకు (Desk Journalists) అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వానికి ఉపేందర్ విజ్ఞప్తి చేశారు. టీడబ్ల్యూజేఎఫ్ ప్రెసిడెంట్ మామిడి సోమయ్య మాట్లాడుతూ.. అక్రెడిటేషన్ ల సంఖ్యకు పత్రికల సర్కులేషన్‌కు లింకు పెట్టడం సరికాదని అన్నారు. పత్రికల సర్క్యులేషన్ ఎంత ఉన్నప్పటికీ.. పని చేసే జర్నలిస్టుల సంఖ్య తగ్గట్లేదు కాబట్టి.. సర్క్యులేషన్ నిబంధనను ఎత్తేయాలని డిమాండ్ చేశారు.
కమిటీలో డెస్క్ జర్నలిస్టులకు చోటు ఇవ్వాలి
ఆర్ఎన్ఐ గుర్తింపు ఉన్న పత్రికల్లో పనిచేస్తున్న డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. టీయూడబ్ల్యూజే(143) ట్రెజరర్ యోగానంద్ మాట్లాడుతూ.. రాష్ట్ర సర్కారు జర్నలిస్టుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని విషయాల్లోనూ జర్నలిస్టులను చిన్న చూపు చూస్తోందని మండిపడ్డారు.
టీజేఎస్ ప్రధాన కార్యదర్శి రాజారాం మాట్లాడుతూ.. జిల్లా అక్రిడేషన్ కమిటీల్లో డెస్క్ జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కార్టూనిస్టులకు, డిజిటల్ మీడియా డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ లు మంజూరు చేయాలన్నారు. నిరసన ర్యాలీలో ఎస్ వెంకటేష్, టి శ్రీనివాస్, రవి, డీజే ఎస్ నేతలు సత్య ప్రసాద్, రమేష్, వెంకటరమణ జర్నలిస్టులు పద్మ, సైదిరెడ్డి, వెంకటేష్, ఆర్.రమేష్, కృష్ణారావు, జనార్ధన్, సదానందం, రాజు, యాదగిరి రెడ్డి, రవీందర్, నరేష్, రాజశేఖర్ గౌడ్, వెంకటేశ్వరరావు, ఉదయ్ కుమార్, విజయ్ తో పాటు కేబుల్ , డిజిటల్ మీడియా ప్రతినిధులు, పలు సంఘాల జర్నలిస్టులు పాల్గొన్నారు.
Read Also: నా కుమారుడి పెళ్లికి రండి.. సోనియా, రాహుల్ గాంధీలకు భట్టి ఇన్విటేషన్
Follow Us On: Youtube

