ముదిగొండలో డిప్యూటీ సీఎం ఆత్మీయ పలకరింపులు

కలం, ఖమ్మం బ్యూరో: హోదాను పక్కనబెట్టి, సామాన్య ప్రజల్లో ఒకడై ముదిగొండ మండల కేంద్రంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) జరిపిన ఆత్మీయ పలకరింపులు స్థానికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మధిర నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆదివారం ముదిగొండకు వచ్చిన ఆయన, అధికార గర్వం లేని ప్రజా నాయకుడికి ఉండాల్సిన నిజమైన నిరాడంబరతను చాటుకున్నారు.

​ముదిగొండ సెంటర్‌లోని ‘నీల్ కమల్ టీ స్టాల్’ వద్ద తన కాన్వాయ్‌ను ఆపి, అక్కడే ఉన్న బల్లపై కూర్చొని ప్రశాంతంగా టీ తాగారు. ఉప ముఖ్యమంత్రి స్వయంగా తమ ముందుకు వచ్చి టీ తాగుతుండడం చూసి స్థానికులు, ప్రయాణికులు ఆశ్చర్యానందాలకు లోనయ్యారు. ఆయనతో మాట్లాడేందుకు జనం పోటీ పడగా, యువత సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ఆయన వారి మనస్సులను గెలుచుకున్నారు.

​టీ స్టాల్ వద్ద ఉన్న మహిళలను ఆప్యాయంగా పలకరించి సంక్షేమ పథకాల అమలు తీరును ఆరా తీసిన భట్టి విక్రమార్క, స్థానిక చిరు వ్యాపారులైన బానోతు రాంజీ, నరసమ్మలతో రోడ్డు విస్తరణ పనుల గురించి మాట్లాడారు. విస్తరణలో ఇండ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరఫున ప్రత్యామ్నాయ ఇండ్లు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

అలాగే రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే పల్లె నాగభూషణం కుమారుడు పల్లె సురేష్ పేరిట ‘రాజీవ్ యువ వికాసం’ కింద రూ. లక్ష రుణ సహాయం అందిస్తామని మాట ఇచ్చారు. అద్దె ఇంట్లో కష్టాలు పడుతున్న నిరుపేద మహిళ యశోదకు రాబోయే ‘ఇందిరమ్మ ఇండ్ల’ జాబితాలో ఇంటి స్థలంతో పాటు ఇల్లు మంజూరు చేయాలని అక్కడికక్కడే సర్పంచ్‌ను ఆదేశించారు.

​అనంతరం, ముదిగొండలో రూపుదిద్దుకుంటున్న 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులతో పాటు రోడ్డు వెడల్పు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకే రోజు నియోజకవర్గ అభివృద్ధి పనులను సమీక్షిస్తూనే, సామాన్య ప్రజల కష్టాలను ఆలకించి అక్కడికక్కడే పరిష్కరించిన డిప్యూటీ సీఎం తీరుపై ముదిగొండ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>