కలం, వెబ్ డెస్క్ : సింగరేణి సంస్థ తెలంగాణ ప్రజల ఆస్తి అని, దానిని నిర్వీర్యం చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ఏ ప్రయత్నాన్నైనా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka ) తెలిపారు. సింగరేణిని అక్రమార్కుల చేతిలో పడనివ్వబోమని స్పష్టం చేశారు. మంచిర్యాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన సింగరేణి కార్మికులకు కారుణ్య నియామక పత్రాలను అందజేసిన వేళ ఈ వ్యాఖ్యలు చేశారు.
కిషన్ రెడ్డి సాధించింది ఏంటి?
కేంద్ర బొగ్గు గనుల మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి సాధించింది ఏంటని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. తాడిచెర్ల బ్లాక్ సింగరేణికి రాకుండా కేంద్రం దగ్గరే పెట్టుకున్నది నిజం కాదా? అని నిలదీసిన డిప్యూటీ సీఎం.. దుర్మార్గంగా ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులకు బ్లాకులు అప్పగించి, సింగరేణి వేలంలో పాల్గొనకుండా చేసింది కిషన్ రెడ్డేనని ఆరోపించారు. కిషన్ రెడ్డి చర్యలతో తాడిచెర్ల, సత్తుపల్లి బ్లాక్-3ల ద్వారా సింగరేణి సంస్థకు రూ. 6,000 కోట్ల భారీ నష్టం వచ్చిందని విమర్శించారు.
‘అబద్ధాలరావు’గా హరీశ్ రావు
హరీశ్ రావు గతంలో మంత్రిగా పనిచేసిన హోదాను మరిచిపోయి రోజుకో అబద్ధం చెబుతూ ‘అబద్ధాల రావు’గా మిగిలిపోయారని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. బ్యాంకింగ్ రంగం దగ్గర రాష్ట్రాన్నే కుదవబెట్టిన ఘనత మీది కాదా? అని హరీశ్ రావును ప్రశ్నించారు. 10 ఏళ్ల పాటు బీఆర్‌ఎస్ నేతలు సింగరేణి వనరులు దోచుకున్నారని మండిపడ్డారు. హరీశ్ రావు, కిషన్ రెడ్డిల ఆధ్వర్యంలో సింగరేణి సౌధాన్ని కూల్చాలని, ఈ సంస్థను కేంద్రం పరిధిలోకి తీసుకోవాలని కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణ చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కలిసి ‘దొంగా దొంగా’ అన్నట్లుగా దొంగ నాటకాలు ఆడుతున్నాయని ఫైర్ అయ్యారు.
‘సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం’
సింగరేణి కార్మికుల భద్రత, సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ.1.25 కోట్ల ప్రమాద బీమా, రూ.10 లక్షల ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పించిందని భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే చరిత్రలో తొలిసారిగా 30 వేల మంది అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ అందించిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని, మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డు పునరుద్ధరణతో పాటు మారుపేర్ల సమస్య పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. నేడు 335 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని, త్వరలోనే మరికొందరికి కారుణ్య నియామక పత్రాలు అందజేస్తామని ప్రకటించారు.

