ఎట్టకేలకు హెల్త్ కార్డులు.. ఉద్యోగులకు అందించిన డిప్యూటీ సీఎం

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆశగా ఎదురు చూస్తున్న హెల్త్ కార్డుల (Employees Health Cards) పంపిణీ ప్రక్రియ మొదలైంది. ఈ కార్డుల ద్వారా వైద్య సేవలు పొందడానికి ప్రత్యేకంగా హెల్త్ కేర్ ట్రస్టు ఏర్పాటు కావడంతో పాటు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారానే కార్డుల్ని డౌన్‌లోడ్ చేసుకునే ప్రక్రియకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) శ్రీకారం చుట్టారు.

సచివాలయంలో శుక్రవారం కార్డుల పంపిణీ సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిదులు, ట్రస్టు బోర్డులో సభ్యులుగా ఉన్నవారికి కార్డులను అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ ప్రభుత్వం కార్పొరేట్ వైద్యం అందించేందుకు వీలుగా గతంలోని హెల్త్ స్కీమ్‌లో కొన్ని మార్పులు చేసి కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగుల, పెన్షనర్ల ‘బేసిక్ పే’ నుంచి ప్రతి నెలా 1.5% చొప్పున ఈ అవసరాల కోసం మినహాయించుకుని అంతే మొత్తాన్ని ప్రభుత్వం సైతం తన వంతుగా జమ చేస్తుంది.

ఈ మొత్తం ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఖాతాలో డిపాజిట్ అవుతాయి. ప్రస్తుతం జారీచేస్తున్న హెల్త్ కార్డుల ద్వారా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఉచితంగా వైద్య సేవలు పొందడానికి మార్గం సుగమమైంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మొత్తం 17,88,336 మంది లబ్ధిదారులకు ఆరోగ్య భద్రత లభిస్తుంది. వీరిలో 4,38,594 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 3,61,955 మంది పెన్షనర్లు, సుమారు 9.88 లక్షల మంది కుటుంబ సభ్యులు ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 886 ప్రైవేట్ హాస్పిటల్స్‌ తో పాటు 114 ప్రభుత్వ హాస్పిటల్స్‌ లో క్యాష్‌లెస్ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. అపోలో, యశోద, కిమ్స్, మెడికవర్, కామినేని, కాంటినెంటల్, కేర్, స్టార్, బసవతారకం వంటి ప్రముఖ కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు అత్యాధునిక వైద్య సేవలు పొందే అవకాశం లభించినట్లయింది. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ విధానానికి అనుగుణంగా 1,816 వైద్య, శస్త్రచికిత్స ప్యాకేజీలను ఈ పథకంలో అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>