కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా ఖానాపూర్ పట్టణంలో కొనసాగుతున్న SIR ఎన్యూమరేషన్ ఫారముల డిజిటలైజేషన్ సరళిని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) శుక్రవారం పరిశీలించారు. తప్పనిసరిగా గడువులోగా ఆన్ లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తం ఓటర్ల సంఖ్య, ఇప్పటి వరకు తిరిగి తీసుకున్న ఫారములు, పూర్తిచేసిన ఆన్ లైన్ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. బీఎల్ఓ యాప్ ను పరిశీలించి ప్రక్రియను మొత్తం పారదర్శకంగా చేయాలని సూచించారు.
అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని చెప్పారు. బూత్ లెవెల్ అధికారులు తప్పనిసరిగా క్షేత్ర స్థాయిలో ఓటర్లకు ఫారములు నింపుటలో సహకారం అందించాలని చెప్పారు. అనంతరం గోదావరి నది పుష్కర ఘాట్లను పరిశీలించారు. గోదావరి నది పుష్కరాల నిర్వహణకు ఇప్పటినుంచే తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, తహశీల్దార్ సుజాత, ఎంపీడీవో రాధా రాథోడ్, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

