కలం, వెబ్ డెస్క్: టీబీ లేని దేశంగా భారత్ అవతరించిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ‘టీబీ ఫ్రీ ఇండియా’ ప్రచారం సత్ఫలితాలు ఇస్తోందని.. దేశంలో టీబీ చికిత్స సదుపాయాలు 90 శాతం వరకు విస్తరించాయని స్పష్టం చేశారు. చండీగఢ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి మాట్లాడారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, గత దశాబ్ద కాలంలో టీబీ వ్యాప్తి 21 శాతం తగ్గిందన్నారు.
వందల కొద్దీ మెడికల్ కాలేజీలు..
ఆరోగ్య రంగానికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని మోదీ అన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు తాము కొత్తగా 15 ఎయిమ్స్‌లు ఏర్పాటు చేశామని, వందల కొద్దీ మెడికల్ కాలేజీలను స్థాపించామన్నారు. అలాగే, క్యాన్సర్ చికిత్స అందించే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. వైద్యారోగ్య వ్యవస్థను ఆయుష్మాన్ భారత్ మరింత పటిష్ఠం చేసిందన్నారు.
పరిశుభ్రత కూడా ముఖ్యమే..
ఆరోగ్య రంగం అంటే ఆసుపత్రులు ఏర్పాటు చేయడమే కాదని.. పరిశుభ్రత కూడా అదే కోవలోకి వస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అందుకోసమే, తమ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించినట్లు వివరరించారు. దీనిలో భాగంగా.. బహిరంగ ప్రదేశాల్లో కోట్లాది టాయ్‌లెట్స్ నిర్మించినట్లు వివరించారు. రోజువారీ జీవన విధానంలో శుభ్రతను భాగం చేయడమే వీటి లక్ష్యమన్నారు.

