కలం, తెలంగాణ బ్యూరో : ఇందిరమ్మ ఇండ్లు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల పెంపు, స్టడీ సర్కిల్స్.. ఇలాంటివన్నీ మిగిలిన నియోజకవర్గాలకంటే ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎక్కువ కేటాయింపు ఉండాలని దళిత ప్రజాప్రతినిధులు (Dalit Legislators) అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేసే కేటాయింపులు కూడా కనీసంగా 10% ఎక్కువ ఉండాలన్న ఏకాభిప్రాయానికి వచ్చారు. నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అధ్యక్షతన నగరంలోని దిల్‌కుషా గెస్ట్ హౌజ్‌లో శుక్రవారం దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మొత్తం దళిత ప్రజా ప్రతినిధులు ఒకే వేదిక మీదకు చేరి ఆ సెక్షన్ ప్రజల సంక్షేమం, ఆ నియోజకవర్గాల అభివృద్ధి గురించి చర్చించుకోవడం విశేషం. ఈ సమావేశంలో జరిగిన చర్చలు, చేసిన తీర్మానాలన్నింటినీ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి వివరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల్లో ఈ నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది వారి భావన.
కులగణన పూర్తి చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ
దాదాపు మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తున్న పోరాటం సుప్రీంకోర్టుకు చేరడం, ఇది ఆహ్వానించదగిన పరిణామమంటూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ తీర్పునిచ్చింది. స్సీ వర్గీకరణ కోసం ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్ణయం జరిగినా లీగల్ చిక్కుల కారణంగా కార్యరూపం దాల్చకపోవడంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఈ తీర్పును చట్టబద్ధం చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఈ సమావేశంలో దళిత ప్రజా ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ, అభినందిస్తూ తీర్మానం చేశారు. దీనికి తోడు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీల వెనకబాటుతనంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సామాజిక న్యాయానికి బలమైన పునాది వేసిందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నిర్ణయాల ద్వారా బీసీ, ఎస్సీ వర్గాల్లో సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసిందని పేర్కొంటూ ముఖ్యమంత్రికి ఏకగ్రీవంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న దళిత సంక్షేమ కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం కొనసాగుతుందని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు.

