ఆ నిధులన్నీ కేంద్రానివే.. బండి సంజయ్​ కీలక వ్యాఖ్యలు

కలం, కరీంనగర్ బ్యూరో : గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర సర్కార్ పన్నేండేళ్లలో రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) తెలిపారు. సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా గంభీరావుపేటలోని పొన్నాలపల్లిలో గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా ఇవ్వడం లేదని ఆరోపించారు.

పల్లె ప్రకృతి వనాలు, రైతు భరోసా కేంద్రాలు, స్మశానవాటికలుసహా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనేనని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా తెలంగాణలోని గ్రామాల్లో దాదాపు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. రూ.వేల కోట్లతో రోడ్లు నిర్మించినట్లు వివరించారు. గత 12 ఏళ్లలో తెలంగాణలోని గ్రామాల అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. సీసీ రోడ్లు, శ్మశానవాటికలు నిర్మించామన్నారు.

లక్షలాది పేద కుటుంబాలకు ఉపాధి కల్పించినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా దాదాపు రూ. 5 వేల కోట్ల రూపాయలతో గ్రామీణ రహదారులను నిర్మించినట్లు వెల్లడించారు. సీఆర్ఐఎఫ్ ద్వారా దాదాపు రూ.6 వేల కోట్లతో గ్రామాలు, మండలాలు, పట్టణాల మీదుగా రోడ్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా రూ. 10 వేల కోట్లతో ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్నామన్నారు.

ఇవి గాకుండా మరెన్నో పథకాల ద్వారా వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రజలకు సౌకర్యాలను కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగు పర్చేందుకు కృషి చేస్తున్నట్లు బండి సంజయ్​ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో లెక్కా పత్రంతో సహా వివరించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో ప్రత్యేకంగా ఎన్ని నిధులు ఖర్చు చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యపడుతుందని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>