నాబార్డ్ అవార్డులలో కరీంనగర్ డీసీసీబీ సత్తా

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా సహకార రంగానికి మరో అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన బ్యాంకుగా కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (Karimnagar DCCB) “బెస్ట్ పెర్ఫార్మింగ్ DCCB” అవార్డును అందుకుంది. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (NABARD) స్థాపించి 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక వార్షికోత్సవ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్ చేతుల మీదుగా కేడీసీసీబీ సీఈఓ ఎన్. సత్యనారాయణ రావు, జనరల్ మేనేజర్‌లు బి. శ్రీధర్, మహమ్మద్ రియాజుద్దీన్, డిప్యూటీ జనరల్ మేనేజర్ బ్రహ్మానంద రావు అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయభాస్కర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ప్రాంతీయ డైరెక్టర్ చిన్మయి కుమార్, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో అత్యుత్తమ సేవలందిస్తూ అగ్రగామిగా నిలిచిన కరీంనగర్ డీసీసీబీకి ఈ గుర్తింపు రావడం జిల్లా సహకార రంగానికి గర్వకారణమని అధికారులు పేర్కొన్నారు.

నాబార్డ్ డీడీఎంకు ప్రత్యేక పురస్కారం

కరీంనగర్ జిల్లా నాబార్డ్ అభివృద్ధి అధికారి (DDM) ఎస్. జయప్రకాష్‌కు కూడా ప్రత్యేక అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య నిల్వ పథకం” కింద జిల్లాలో గోదాముల నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయడం, ప్రధానమంత్రి కుసుమ్ (PM-KUSUM) పథకం కింద ఐదు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్లు, మౌలిక వసతుల అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు అందించారు. ఈ రెండు పురస్కారాలు కరీంనగర్ జిల్లా సహకార, గ్రామీణ స్వయం సమృద్ధి రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని సహకార సంఘాల ప్రతినిధులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో రైతులు, గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ గుర్తింపు దోహదపడుతుందని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>