కలం, వెబ్ డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ రేపు చేపట్టిన ధర్నాకు అనుమతి ఎందుకు నిరాకరణకు కారణాలపై ఢిల్లీ పోలీసులు (Delhi Police) ప్రకటన విడుదల చేశారు. “జులై నెలలో ఒక్క రోజు నిరసన చేస్తామంటే అనుమతించాం. అది కాస్తా నెల రోజులకు పైగా కొనసాగింది. సుమారు 200 మంది పోలీసులు గాయపడితే.. రెండు వేల మందికి పైగా క్రిమినల్స్ ఆందోళనల్లో చొరబడి హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడ్డారు. అమాయకులైన విద్యార్థులు గాయపడ్డారు. మళ్లీ అలాగే అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. గత అనుభవాల నేపథ్యంలో ప్రజా భద్రత, కొద్ది రోజులుగా జరుగుతున్న నిరసనల్లో మహిళా కానిస్టేబుళ్లపై జరిగిన దాడిని సీరియస్ గా తీసుకుంటున్నాం. అందుకే అనుమతి నిరాకరిస్తున్నాం” అని ఢిల్లీ పోలీస్ విభాగం డీసీపీ సీజేపీ ప్రతినిధులకు సమాచారం అందించారు.
ఆ స్థలం ఇరుకుగా..
ఆందోళన కోసం ఎంచుకున్న స్థలం చాలా ఇరుకైన ప్రాంతమని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. “జంతర్ మంతర్ దగ్గర ఒకేసారి కేవలం వెయ్యి మంది మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెళ్లడానికి కూడా ఉండదు. దేశ రాజధాని ఢిల్లీలో కార్యకలాపాలు చాలా సాధారణంగా జరగాల్సి ఉంటుంది. ఆందోళన చేసే హక్కుని గౌరవిస్తూనే, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. నిరసన కోసం ఎంచుకున్న ప్రదేశం ఏమాత్రం సౌకర్యవంతం కాదు. సీజేపీ ఎలాంటి అనుమతులు లేకుండా ధర్నా చేయాలని భావిస్తోంది. చట్టబద్ధ అనుమతులు తీసుకోవాలని సుప్రీం కోర్టు కూడా నిర్దేశించింది. అన్ని కోణాల్లో ఆలోచించి, ముందు జాగ్రత్త చర్యగా అనుమతి నిరాకరించాల్సి వస్తోంది” అన్నారు.

