కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీ మద్యం కేసులో డిశ్చార్జ్ పిటిషన్లు అనుమతి ఇస్తూ ఇటీవల కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు వెళ్లారు. కోర్టు రిజిస్టర్‌లో వేలిముద్రలు నమోదు చేశారు. సీబీఐ కేసు నుంచి డిశ్చార్జ్ పిటిషన్ల ప్రక్రియ పూర్తి చేయడానికి కవిత వేలిముద్రలు వేసి వచ్చారు. కోర్టులో వేలిముద్రలు నమోదు చేసిన అనంతరం అక్కడినుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవితకు (Kavitha) భారీ ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం 23 మందిపై ఉన్న అభియోగాలను తొలగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇందులో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీస్ సిసోడియా సహా మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా దర్యాప్తులో పలు లోపాలు ఉన్నాయని సీబీఐని న్యాయస్థానం తప్పుబట్టింది. కేసు నమోదు, దర్యాప్తులో సీబీఐ అనుసరించిన విధానాన్ని సైతం న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. 45 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం నిందితులకు క్లీన్ చిట్ ఇస్తున్నట్లు తీర్పు వెలువడిన విషయం విదితమే.

