epaper
Monday, January 19, 2026
spot_img
epaper

ఐటీ శాఖకు ఢిల్లీ హైకోర్టు రెండు లక్షల జరిమానా

కలం, వెబ్ డెస్క్: ఆదాయపు పన్ను శాఖకు ఢిల్లీ హైకోర్టు రెండు లక్షల జరిమానా విధించింది. ఎన్డీటీవీ సమర్పించిన ఐటీ రిటన్స్ విషయంలో మరోసారి స్టడీ చేయాల్సి ఉంటుందని ఆ శాఖ జారీ చేసిన నోటీసులపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్డీటీవీ సమర్పించిన ఐటీ రిటన్స్ లో తేడాలు ఉన్నాయన్న పిటిషన్‌పై దాదాపు ఎనిమిదేళ్ళుగా కోర్టు విచారిస్తూ ఉన్నది. రిటర్న్స్ సమర్పించిన తర్వాత ఒకసారి నోటీసు ఇచ్చి లోతుగా స్టడీ చేసిన ఐటీ శాఖ మరోసారి కూడా విశ్లేషించాల్సి ఉన్నదని నోటీసు ఇవ్వడంతో ఎన్డీటీవీ వ్యవస్థాపకులైన సీనియర్ జర్నలిస్టు ప్రణయ్‌రాయ్, ఆయన భార్య రాధికారాయ్ 2017లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఐటీ రూల్స్ కు విరుద్ధంగా రెండోసారి ‘అంచనా’ పేరుతో నోటీసులు జారీ చేయడం సమంజసం కాదన్నారు.

చెరో లక్ష చొప్పున పరిహారం కట్టండి :

ఐటీ రిటన్స్ లెక్కల్లో తేడాలు ఉన్నాయని ఐటీ శాఖ ఇచ్చిన నోటీసును సానుకూలంగా స్పందించామని ప్రణయ్‌రాయ్, రాధికారాయ్ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఐటీ అధికారులు విశ్లేషించారని, మరోసారి అంచనా వేయాల్సి ఉంటుందనే పేరుతో నోటీసు ఇచ్చి వారి ఉద్దేశాలను ఆపాదించాలని చూస్తున్నారని, ఇది నిబంధనల ఉల్లంఘనే అని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. వేర్వేరు అకౌంట్ల నుంచి వడ్డీ లేని రుణాల పేరుతో ఆర్ఆర్‌పీఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఖాతాలోకి డబ్బులు వచ్చాయన్నది ఐటీ వాదన. 2013 జూన్‌లోనే ఒకసారి రీఎసెస్‌మెంట్ పేరుతో లెక్కలు విశ్లేషించారని, ఆ తర్వాత మళ్ళీ నోటీసు ఇవ్వడంతో 2016లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ప్రణయ్‌రాయ్, రాధికారాయ్ తరఫు న్యాయవాదులు సచిత్ జోలీ, దేవాంశ్ జైన్, ఇయుష్టి రావత్ తదితరులు వాదించారు. ఇరు తరఫున వాదనలను విన్న తర్వాత పిటిషన్లు పరిష్కారమయ్యాయని ప్రకటించిన జస్టిస్ దినేష్ మెహతా, వినోద్ కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇద్దరికీ చెరో లక్ష చొప్పున నష్టపరిహారాన్ని చెల్లించాలని ఐటీ శాఖ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ఈ పిటిషన్‌కు సంబంధించి ఐటీ శాఖకు భారీగానే జరిమానా విధించాల్సి ఉన్నా పరిష్కారం పేరుతో రెండు లక్షలతోనే సరిపెడుతున్నామని బెంచ్ పేర్కొన్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>