కలం, ఖమ్మం బ్యూరో: దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలం (Bhadrachalam)లో కొలువై ఉన్న వైకుంఠ రాముడు, ఓంకార రాముడు, రామ నారాయణుడు అనే విలక్షణ నామ త్రయంతో విరాజమానుడైన భద్రాచల రామచంద్ర ప్రభువు వారి కళ్యాణ మహోత్సవంలో ఉపయోగించే తలంబ్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా కనిపించని ముత్యాల తలంబ్రాలు, గోటి తలంబ్రాలు, ఎరుపు రంగు తలంబ్రాలు, సుగంధ ద్రవ్యాలు కలిపిన తలంబ్రాలు ఇక్కడ మనకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ తలంబ్రాలన్నిటికీ ఒక్కో ప్రత్యేకత, పవిత్రత ఉన్నాయి . స్వామి వారి నుదుటి పై జాలు వారే తలంబ్రాలను తమపై చల్లుకుంటే, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ తలంబ్రాలను మన దేశంలోని ప్రజలే కాకుండా దాదాపు 90 దేశాలలోని ప్రవాస భారతీయులు తెప్పించుకుంటారు.
భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణంలో ముత్యాల తలంబ్రాల (pearl Talambralu) కు ఒక విశిష్టమైన చరిత్ర ఉంది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రమే ముత్యాలను తలంబ్రాలుగా వాడతారు. ఈ సంప్రదాయాన్ని భక్త రామదాసు ప్రారంభించారు. భద్రాచల ఆలయాన్ని నిర్మించినప్పుడు, సీతారాముల కల్యాణం కోసం తన సొంత ధనంతో, భక్తుల సహకారంతో అమూల్యమైన ముత్యాలను సేకరించి స్వామివారికి సమర్పించారు.
ఆ సంప్రదాయాన్ని గౌరవిస్తూ, నేటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి లేదా మంత్రులు కల్యాణం రోజున ముత్యాల తలంబ్రాలను, పట్టు వస్త్రాలను సమర్పిస్తుంటారు. భద్రాచల రాముల వారి తలంబ్రాలలో మరో విశిష్టత గోటి తలంబ్రాలు, ఈ తలంబ్రాలను చేతితో వడ్లను ఒలిచి తయారు చేస్తారు. ఈ సమయంలో భక్తులు నోటి తుంపర్లు పడకుండా నోటికి అడ్డంగా వస్త్రం కట్టుకుని వడ్లను ముక్కలు కాకుండా జాగ్రత్తగా ఓలుస్తుంటారు. ఓలిచేటప్పుడు మాంసాహారం తీసుకోరు, చెప్పులు ధరించరు. ఈ విధంగా నిష్ఠతో కోటి అక్షింతలు తయారు చేసి తలల పై తలంబ్రాలను మోస్తూ, కాలి నడకన భద్రాచలం చేరుకొని దేవాలయంలో సమర్పిస్తుంటారు.

