ఢిల్లీ వర్సెస్ ముంబై.. అరుణ్ జైట్లీ స్టేడియంలో బిగ్ ఫైట్!

కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2026 హంగామా ఇప్పుడు దేశ రాజధానికి చేరుకుంది. శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ (DC vs MI) జట్లు తలపడనున్నాయి. తమ మొదటి మ్యాచ్‌ల్లో ఘనవిజయాలు సాధించిన ఈ రెండు జట్లు, నేటి పోరులోనూ అదే ఊపును కొనసాగించాలని పట్టుదలగా ఉన్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ టోర్నీలో ఇరు జట్ల భవిష్యత్తుకు కీలకమైన దిశానిర్దేశం చేయనుంది.

అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు తన మొదటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై అద్భుత విజయం సాధించింది. ముఖ్యంగా సమీర్ రిజ్వీ ఆడిన ఇన్నింగ్స్ జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. కెఎల్ రాహుల్, డేవిడ్ మిల్లర్ వంటి కీలక ఆటగాళ్లతో పాటు కుల్దీప్ యాదవ్ నేతృత్వంలోని బౌలింగ్ విభాగం సొంత గడ్డపై ముంబైని అడ్డుకోవాలని చూస్తోంది.

హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై జట్టు కోల్‌కతాపై 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఫుల్ జోష్‌లో ఉంది. రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం జట్టుకు కొండంత బలం. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వంటి స్టార్ ఆటగాళ్లు ఢిల్లీ బ్యాటర్లను పరీక్షించనున్నారు.

రికార్డులు, అంచనాలు

చరిత్రను పరిశీలిస్తే ఢిల్లీపై ముంబై ఇండియన్స్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన 37 మ్యాచ్‌ల్లో ముంబై 21 సార్లు గెలవగా, ఢిల్లీ 16 సార్లు విజయం సాధించింది. 2023 ఐపీఎల్ సీజన్ నుండి జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో ముంబై ఏకంగా నాలుగు సార్లు గెలిచింది. అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. బ్యాటింగ్ లోతు ఎక్కువగా ఉన్న ముంబైకి ఈ మ్యాచ్‌లో స్వల్పంగా గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

తుది జట్లు (అంచనా):

ఢిల్లీ: కెఎల్ రాహుల్, పాతుమ్ నిస్సంక, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (సి), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రజ్ నిగమ్, లుంగీ ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్.

ముంబై: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (సి), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, ఎఎమ్ గజన్‌ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>