Mobile Popup Ad
Mobile Popup Ad

చిల్లర విమర్శలు మానుకో.. ఎమ్మెల్యేకు వినయ్ భాస్కర్ హెచ్చరిక

కలం, వరంగల్ బ్యూరో: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్(Dasyam Vinay Bhasker), ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, వ్యక్తిగత విమర్శలు చేయొద్దంటూ హెచ్చరించారు. “నాపై చిల్లర మాటలు మాట్లాడుతున్నావు.. ఒక్కసారి నీ చరిత్ర ఏంటో గుర్తు తెచ్చుకో” అంటూ వినయ్ భాస్కర్ మండిపడ్డారు. స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో మద్యపాన నిషేధం సమయంలో పక్క రాష్ట్రాల నుంచి ప్లాస్టిక్ బాటిళ్లు తెచ్చుకుని అమ్ముకున్న ఘటనలను ప్రస్తావిస్తూ, అప్పట్లో పోలీసులు వెంటపడిన సందర్భాలను గుర్తుచేశారు.

ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజాసేవ కోసం అని, వ్యక్తిగత విమర్శల కోసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. “మళ్ళీ నాపై చిల్లర ఆరోపణలు చేస్తే ఖబడ్డార్ బిడ్డా” అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని, తనపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. తాను హనుమాన్ ఆలయానికి భక్తునిగా వెళ్లానని, ఆలయ భూమిని గుడి అవసరాల కోసం కేటాయించాలని అడగడం తప్పా అని ప్రశ్నించారు. భక్తుల తరఫున చేసిన డిమాండ్‌కు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని అన్నారు.

న్యూ శాయంపేట శ్రీ భక్తాంజనేయ ఆలయ భూమిని హోటల్ కోసం కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన వినయ్ భాస్కర్, దీనిపై హనుమాన్ భక్తులు స్పందిస్తారని పేర్కొన్నారు. హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేసిన వారిపై కేసులు పెట్టి, విగ్రహం కూల్చిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేసిన ఆయన, డైవర్షన్ రాజకీయాలు మానుకోవాలని నాయిని రాజేందర్ రెడ్డికి హితవు పలికారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>