BRS ఎమ్మెల్యేలపై పోలీసుల దురుసు ప్రవర్తన: దాసరి

కలం,పెద్దపల్లి: రాష్ట్ర అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్రంగా ఖండించాల్సిన విషయమని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి (Dasari Manohar Reddy) స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజా ప్రతినిధుల పట్ల పోలీసుల ప్రవర్తనకు నిరసనగా పెద్దపల్లి బస్టాండ్ వద్ద సోమవారం బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై ఇచ్చిన హామీలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు ప్రజాప్రతినిధులు వస్తే, వారిని అడ్డుకుని  అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదన్నారు.

కేటీఆర్, హరీశ్‌రావు, సునీత లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్ తదితర బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన, తోపులాటలో కొందరికి గాయలవడం ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తుందని దాసరి విమర్శించారు. ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించడం మరింత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి మాట్లాడే హక్కు .. ప్రజల తరఫున ప్రశ్నించే హక్కు ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలదీసే హక్కు ఉందని.. ఆ హక్కులను పోలీసుల బలంతో అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదన్నారు.

అసెంబ్లీ ప్రజల సమస్యలను చర్చించే పవిత్రమైన వేదికని, అక్కడికి వచ్చే ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడం అంటే ప్రజల గొంతును అడ్డుకోవడమేని దాసరి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ప్రశ్నిస్తున్నందుకే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ప్రజల తరఫున ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం, నిరసన తెలిపితే పోలీసులతో అణచివేయడం సరికాదన్నారు.

ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుని ప్రజాప్రతినిధుల హక్కులను గౌరవించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల సమస్యలపై పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపదన్నారు. పోలీసుల బెదిరింపులకు, అక్రమ నిర్బంధాలకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>