జూన్‌లో సనత్‌నగర్ టిమ్స్‌ ప్రారంభిస్తాం: మంత్రి దామోదర

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని సనత్‌నగర్ టిమ్స్‌ (TIMS) ఆసుపత్రిని జూన్‌లో ప్రారంభిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Rajanarasimha) అన్నారు. సనత్‌నగర్ టిమ్స్‌లో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్‌ను ఆయన పరిశీలించారు. హాస్పిటల్ A, B, C బ్లాకులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అవుట్ పేషెంట్ (ఓపీ) రిజిస్ట్రేషన్, ఐపీ వార్డులు, ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ల్యాబులు, మెకనైజ్‌డ్ ల్యాండ్రీ, కిచెన్ తదితర అన్ని డిపార్ట్‌మెంట్లను అధికారులతో మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా పెండింగ్ పనులపై దిశానిర్ధేశం చేశారు. పెండింగ్ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్‌ అండ్ బీ, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. హాస్పిటల్‌కు నీళ్లు, పవర్ సప్లైలో ఎలాంటి ఆటంకం ఉండకూడదని, ఆసుపత్రకి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా 24 గంటల నీటి సరఫరా ఉండాలన్నారు. ఫైర్ సేఫ్టీ విషయంలో రాజీ ఉండకూడదని, అన్ని ఫ్లోర్లలో మరోసారి పూర్తిస్థాయి పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు‌.

అన్ని సౌకర్యాలతో హాస్పిటల్‌ను సిద్ధం చేయాలి..

టిమ్స్ ఆసుపత్రిలోని రిసెప్షన్ ఏరియా, హెల్ప్ డెస్క్, ఓపీ కౌంటర్లు, వెయిటింగ్ హాల్, ఓపీ కన్సల్టేషన్ రూమ్స్, డయాగ్నస్టిక్స్, ఇన్ పేషెంట్ వార్డులు, ఫార్మసీ తదితర ఏర్పాట్లను మంత్రి (Damodar Rajanarasimha) పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కౌంటర్స్, ఫార్మసీ కౌంటర్స్ పెంచాలని సూచించారు. సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ఎక్స్ రే, ఆల్ట్రాసౌండ్ తదితర యంత్రాలను పరిశీలించిన మంత్రి.. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ యంత్రాలు పూర్తిస్థాయిలో పేషెంట్లకు ఉపయోగపడాలని చెప్పారు. ఇందుకు అవసరమైన డాక్టర్లు, ఇతర సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రారంభం నాటికి అన్ని సౌకర్యాలతో హాస్పిటల్‌ను సిద్ధం చేయాలని అన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.

1000 బెడ్లతో హాస్పిటల్ నిర్మాణం..

సనత్‌నగర్ టిమ్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా వైద్య సేవల ట్రయల్ రన్ జరుగుతోందని మంత్రి తెలిపారు. కొన్ని ఫినిషింగ్ వర్క్స్ జరుగుతున్నాయని అన్నారు. ఆ పనులన్నీ గడువులోగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించామని వివరించారు. ఈ ఆసుపత్రి 1000 బెడ్ల హాస్పిటల్, ఇందులో 300 ఎమర్జెన్సీ బెడ్లు ఉంటాయని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితుల ప్రాణాలు నిలిపే గొప్ప హాస్పిటల్‌గా దీన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలు, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలకు ఈ హాస్పిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఉంటుందని చెప్పారు. ఇక్కడే‌ అద్భుతమైన రీసెర్చ్ సెంటర్ అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వివరించారు.

Read Also: సీఎం విజయ్ జ్యోతిష్యుడికి ప్రభుత్వంలో కీలక పదవి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>