కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో వైద్యుల కొరత, డ్యూటీ డాక్టర్ల గైర్హాజరు, సిబ్బంది స్థానంలో ఓ ప్రైవేట్ డాక్టర్ రోగులకు చికిత్స అందించారనే ఆరోపణలున్నాయి. ఆస్పత్రి తీరుపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో మంత్రి తక్షణమే స్పందించారు.
ఈ అంశంపై వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లతో మంత్రి మాట్లాడారు. ఆస్పత్రిలో జరిగిన దారుణమైన పరిస్థితిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా కఠిన పర్యవేక్షణ ఉండాలని అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

