కలం, స్పోర్ట్స్ : జపాన్‌లో త్వరలో జరగనున్న ఆసియా క్రీడలకు (Asian Games) భారత్ తన ‘బి’ టీమ్‌ను పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఆటగాళ్లకు కల్పిస్తున్న సౌకర్యాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI ) తీవ్ర అసంతృప్తితో ఉంది. పరిస్థితిని పరిశీలించేందుకు బోర్డు ఒక పరిశీలకుడిని అక్కడికి పంపనుంది. ఆ పరిశీలకుడి నివేదిక ఆధారంగానే ప్రధాన జట్టును పంపాలా లేదా ప్రత్యామ్నాయ ‘బి’ జట్టును పంపాలా అనే దానిపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో జపాన్ ఒలింపిక్ అధికారుల ఏర్పాట్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. మైదానంలో ఆటగాళ్ల కోసం డ్రెస్సింగ్ రూమ్‌లను టెంట్లలో ఏర్పాటు చేశారు.
అంతేకాకుండా, వాష్‌రూమ్‌లు ఆ టెంట్లకు ఏకంగా 500 మీటర్ల దూరంలో ఉన్నాయి. ఆటగాళ్లకు కేటాయించిన హోటల్ గదులు కూడా చాలా చిన్నవిగా ఉండటం బోర్డును కలవరపెడుతోంది. వాస్తవానికి ఈ టోర్నీ కోసం బీసీసీఐ ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో బలమైన పురుషుల జట్టును, హర్మాన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో మహిళల జట్టును ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో క్రీడాకారులకు తగిన వసతులు లభిస్తేనే ప్రధాన జట్టు పాల్గొంటుంది. ఒకవేళ ఏర్పాట్లు ఆశాజనకంగా లేకపోతే ‘బి’ టీమ్‌ను రంగంలోకి దించే ఆలోచనలో బీసీసీఐ ఉంది.

