కాపర్ దొంగలు దొరికారు.. సంగారెడ్డిలో అంతర్ జిల్లా ముఠా అరెస్ట్!

కలం, మెదక్ బ్యూరో: హైవేపై కత్తులతో బెదిరించి, విలువైన కాపర్ (Copper Robbery) ముడి సరుకును దోపిడీ చేసిన అంతర్ జిల్లా దొంగల ముఠాను సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 18న అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్‌లోని బోలక్‌పూర్ నుంచి ముంబైకి 171 బ్యాగుల కాపర్ మెటీరియల్‌తో ఓ వాహనం వెళ్లుతోంది. అదే సమయంలో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి అడ్డుకున్నారు. వాహన డ్రైవర్‌ను కత్తులతో బెదిరించి తమ కారులోకి ఎక్కించుకుని ఆరూర్ వద్ద వదిలేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మునిపల్లి పోలీసులు, జీపీఎస్ ఆధారంగా వాహనాన్ని గుర్తించారు. అందులో ఉండాల్సిన 1.13 కోట్ల విలువైన 171 బ్యాగుల్లో 123 బ్యాగుల కాపర్ చోరీకి గురైనట్లు తేలింది.

బాధితుడు మొహమ్మద్ ఫయాజుద్దీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు సీసీఎస్, మునిపల్లి, సదాశివపేట పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. టోల్‌గేట్ సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారంగా డీసీఎం వాహనాన్ని తనిఖీ చేశారు. హైదరాబాద్ కు చెందిన A2 షేక్ సబీర్ షరీఫ్‌ (26) ను అదుపులోకి తీసుకున్నారు. A1 సోహెల్‌తో పాటు మరో 10 మందితో కలిసి ఈ దోపిడీకి పాల్పడినట్లు అంగీకరించాడు.

1.13 కోట్ల విలువైన 123 ప్లాస్టిక్ బ్యాగుల కాపర్ ముడి సరుకుతో ఉన్న మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>