కలం, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ (Cyclone Alert) శ్రీకాకుళం జిల్లా వైపు దూసుకొస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. మరికాసేపట్లోనే వజ్రపు కొత్తూరు–భోగాపురం మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 60–70 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని స్పష్టం చేశారు. సంతబొమ్మాళి మండలం కరిపేట బీచ్ వద్ద తుఫాన్ ల్యాండ్ ఫాల్ అవుతుందని గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా కరెంట్ సరఫరా నిలిపివేశారు. విద్యుత్తు లైన్లు తెగి పడితే ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా నిలిపేశారు. ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని హెచ్చరించారు.
బహుదా నది ఉగ్ర రూపం..
తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిరంతరం అధికారులతో సమీక్ష చేస్తున్నారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు చేపట్టారు. ఇప్పటికే బహుదా నది ఉగ్ర రూపం దాల్చింది. నదీ పరివాహకంలోని వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో పరిసర గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో ఉండిపోయారు. ఇప్పటికే పంటలన్నీ నీట మునిగిపోయాయి. తీరానికి అతి సమీపంలోనే వాయుగుండం కేంద్రీకృతం కావడంతో డొంకూరు, ఈనేసుపేటలోని మత్య్సకారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

