కలం, మెదక్ బ్యూరో: హైదరాబాద్ – ముంబై నేషనల్ హైవే – 65 రోడ్డు విస్తరణ పనుల కోసం ఇస్నాపూర్ వద్ద ట్రాఫిక్ (Isnapur Traffic Diversion) మళ్లింపు కోసం ప్రయాణికులకు పోలీస్ శాఖ ముందస్తు సూచనలు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని ఇస్నాపూర్ జంక్షన్ వద్ద జాతీయ రహదారి (NH-65) పై ఫ్లైఓవర్, వెహికల్ అండర్ పాస్ ఫేజ్-2 నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు. సెప్టెంబరు 26, 2026 నుండి ప్రారంభమై రెండు నెలల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు.
ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..
బీహెచ్ ఈఎల్ మీదుగా ఆర్సీ పురం & పటాన్‌చెరు నుండి కంది, సంగారెడ్డి వైపు వెళ్లే వాహనాలు అన్ని పటాన్ చెరువు బస్టాండ్ దాటక ఉన్న నోవాపాన్ జంక్షన్ వద్ద డైవర్షన్ తీసుకొని కార్దనూర్ ఎక్స్ రోడ్ మీదుగా IDA పాశమైలారం, ఇంద్రకరణ్, కంది మీదుగా సంగారెడ్డి చేరుకోవాలి.
మరోవైపు ముత్తంగి..
ఓఆర్ఆర్ ORR Exit-3 నుండి సంగారెడ్డి వైపు వెళ్లే వాహనాలు ముత్తంగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు దగ్గర డైవర్షన్ తీసుకొని , కార్దనూర్ ఎక్స్ రోడ్ మీదుగా IDA పాశమైలారం, ఇంద్రకరణ్, కంది మీదుగా సంగారెడ్డికి వెళ్లాల్సి ఉంటుంది. ఇస్నాపూర్ జంక్షన్ వద్ద ప్రధాన రహదారి నుండి వాహనాలను NH-65 సర్వీస్ రోడ్డు పైకి మళ్లిస్తున్నందున, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు ఇరుకుగా ఉండి తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణికులు ఈ ప్రత్యామ్నాయ మార్గాలను గమనించి, పోలీసులకు సహకరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

