కలం, నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ను గురువారం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చీఫ్ ఇంజనీర్ ఎంఎస్ సహారే (MS Sahare) సందర్శించారు. కృష్ణా గోదావరి బోర్డ్ ఆర్గనైజేషన్(కేజీబీవో) ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధీరజ్ సింఘాల్, జేఈ ఉమాశంకర్ తదితరులతో కలసి జలాశయ నీటిమట్టాన్ని తెలిపే ప్రాంతాన్ని, డ్యాం క్రస్ట్ గేట్ల విభాగాన్ని, కంట్రోల్ రూమ్లను, టెలీమెట్రీ విధానాన్ని పరిశీలించారు. సాగర్ ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఆండాల్, కృష్ణయ్య, సత్యనారాయణ జలాశయం స్థితిగతులు వివరించారు.
అనంతరం వీళ్లు బుద్ధ వనాన్ని సందర్శించారు. బుద్ధ చరిత వనంలోని సిద్ధార్థుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించి వందనం సమర్పించారు. ధ్యాన వనం, స్తూప వనాలను వీక్షించారు. మహా స్తూపం లోని ధ్యాన మందిరంలో సీఈ బుద్ధ జ్యోతులను వెలిగించారు. వీళ్లను బుద్ద వనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర కండువాలతో సత్కరించారు. సాగర్ సందర్శనలో భాగంగా నాగార్జునకొండ మ్యూజియాన్ని, అక్కడ నిర్మించిన పునర్నిర్మిత కట్టడాలైన అశ్వమేథ యజ్ఞశాల, మహాస్తూపం,సింహాల విహార ప్రాంతాలనూ సీఈ(MS Sahare) సందర్శించారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ చారిత్రక విశేషాలు వివరించారు.

