Mobile Popup Ad
Mobile Popup Ad

ఆకాష్ మ్యాజిక్‌కు తడబడిన చెన్నై.. లక్నో టార్గెట్ 188

క‌లం, వెబ్‌డెస్క్‌: సొంతగడ్డపై లక్నో సూపర్ జెయింట్స్‌ (LSG) బౌలర్లు నిప్పులు చెరుగుతారని భావిస్తే.. యువ బౌలర్ ఆకాశ్ సింగ్ మినహా మిగిలిన వారంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బ్యాటర్లలో కార్తీక్ శర్మ ఒక్కడు ఒంటరి పోరాటం చేశాడు. 71 పరుగులతో మెరిశాడు. జట్టుకు మంచి స్కోర్ ఇవ్వడంలో కార్తీక్ కీలక పాత్ర పోషించాడు. ఆఖరిలో శివమ్ దూబే బౌండ్రీల మోత మోగించడంలో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఓపెనర్లు సంజూ శాంసన్ (20), రుతురాజ్ గైక్వాడ్ (13) ఆకాశ్ ధాటికి స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. ఊర్విల్ పటేల్ (6) కూడా నిరాశపరచడంతో 52 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి చెన్నై కష్టాల్లో పడింది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును కార్తీక్ శర్మ తన అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. లక్నో బౌలర్లను ఉతికేస్తూ కేవలం 42 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 71 పరుగులు పిండుకున్నాడు. అతడికి డెవాల్డ్ బ్రెవిస్ (25) కాసేపు సహకరించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే ఈ జోడీని విడదీయడంలో షాబాజ్ అహ్మద్, మహమ్మద్ షమీ సఫలమైనా.. అప్పటికే చెన్నై గౌరవప్రదమైన స్థితికి చేరుకుంది. ఇన్నింగ్స్ చివరలో శివమ్ దూబే తన పవర్ హిట్టింగ్‌తో స్టేడియంను హోరెత్తించాడు. కేవలం 16 బంతులు ఎదుర్కొన్న దూబే 200 స్ట్రైక్ రేట్‌తో 32 పరుగులు జోడించి నాటౌట్‌గా నిలిచాడు. ప్రశాంత్ వీర్ (13*) అతడికి అండగా నిలవడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్ తన కోటా 4 ఓవర్లలో కేవలం 26 పరుగులే ఇచ్చి 3 ప్రధాన వికెట్లు పడగొట్టి చెన్నై వెన్ను విరిచాడు. మరోవైపు సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ 41 పరుగులు సమర్పించుకోగా, ప్రిన్స్ యాదవ్ 49 పరుగులు ఇచ్చి అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు. మయాంక్ యాదవ్ పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్లు తీయలేకపోయాడు. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగుతున్న లక్నో.. తమ బ్యాటర్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>