కలం, ఖమ్మం బ్యూరో: జాతీయ వేదికపై ఖమ్మం పోలీస్ సత్తా చాటేందుకు జిల్లా ఎస్ఐ గంజి స్వప్న సిద్ధమయ్యారు. ఇటీవల నిర్వహించిన 3వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ (Telangana Police Duty Meet) లో అద్భుత ప్రతిభ కనబరిచి ఏకంగా నాలుగు పతకాలు సాధించడమే కాకుండా, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ఖమ్మం ఖ్యాతిని జాతీయ వేదికపైకి తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆమెను వరంగల్ పోలీస్ కమిషనర్, భద్రాద్రి జోన్ ఇంచార్జ్ డీఐజీ ఎన్. శ్వేత, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం ప్రత్యేకంగా అభినందించారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో ఎస్ఐ గంజి స్వప్న వివిధ విభాగాల్లో పతకాల పంట పండించారు. మెడికో లీగల్ ఓరల్ టెస్ట్‌లో ఒక సిల్వర్ మెడల్, ఫోరెన్సిక్ సైన్స్‌లో ఒక సిల్వర్ మెడల్ సాధించారు. అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫోటోగ్రఫీలో ఒక బ్రాంజ్ మెడల్, లా విభాగంలో మరో బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుని సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో నాలుగు పతకాలతో మెరిసిన ఎస్ఐ గంజి స్వప్న, ఈ ఏడాది డిసెంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు ముంబైలో నిర్వహించనున్న 70వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌కు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా డీఐజీ ఎన్. శ్వేత, సీపీ సునీల్ దత్ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో నాలుగు పతకాలు సాధించి జాతీయ వేదికపై పోటీ పడేందుకు ఎంపిక కావడం ఖమ్మం పోలీస్ శాఖకు గర్వకారణమని కొనియాడారు. ముంబైలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లోనూ ఇదే ప్రతిభ, జోరును కొనసాగించి మరిన్ని పతకాలు సాధించాలని, ఖమ్మం పోలీస్ శాఖకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ అభినందన కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

