కలం, చండూరు: మునుగోడు (Munugode) నియోజకవర్గ స్థాయి సిపిఎం(CPM) రాజకీయ శిక్షణ తరగతులను ఈ నెల 25, 26 తేదీలలో గట్టుప్పల్ మండల కేంద్రంలోని ఎస్‌వీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం తెలిపారు. శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం చండూరు మండల పరిధిలోని కొండాపురం గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండ శ్రీశైలం మాట్లాడుతూ.. శిక్షణ తరగతులలో మునుగోడు నియోజకవర్గంలోని మౌలిక సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం నిరంతరం పోరాడుతోందని అన్నారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు రహదారులు నిర్మించి, బస్సు సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు, అన్ని రకాల పింఛన్లు అందించాలని కోరారు. నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు. రాజ్యాంగ విలువలు, లౌకిక ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం ప్రజలు సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ నెల 10న మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో జైల్‌భరో (Jail Bharo) కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, కొండాపురం గ్రామ శాఖ కార్యదర్శి కొత్తపల్లి నరసింహ, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు వరికుప్పల ముత్యాలు, బిక్షం తదితరులు పాల్గొన్నారు.

