కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. మెట్రో రెండో దశకు అనుమతులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం పర్యటన కొనసాగుతున్నది. బుధవారం కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో రేవంత్ భేటీ అయ్యారు. మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గతంలో లేవనెత్తిన అభ్యంతరాలన్నీ పరిష్కారమైనందున, వెంటనే ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
ఎల్ అండ్ టీతో వివాదం పరిష్కారం
మెట్రో మొదటి దశను నిర్వహించిన ఎల్ అండ్ టీ సంస్థతో ఆపరేషనల్ సమన్వయం, ఇతర ఒప్పందాల విషయంలో ఉన్న వివాదాలను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పరిష్కరించుకున్నట్లు కేంద్రానికి వివరించారు. హైదరాబాద్ మెట్రోలో 100% షేర్లను కొనుగోలు చేసి, ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తన స్వాధీనంలోకి తీసుకున్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇకపై పనుల ప్రారంభానికి ఎటువంటి అడ్డంకులు లేవని సీఎం స్పష్టం చేశారు. మరి ముఖ్యమంత్రి అభ్యర్థనపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

