కలం, వెబ్ డెస్క్: ఏపీలో ఆసక్తికరంగా మారిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ (Prashna Raavan) అరెస్ట్ పై సీపీఐ నారాయణ (CPI Narayana) కీలక వ్యాఖ్యలు చేశారు. రావణ్ మాట్లాడిన దాంట్లో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏం మాట్లాడారో రావణ్ కూడా అదే మాట్లాడారని అన్నారు. ఇంకా పవన్ కల్యాణ్ సభలోనే చెప్పు చూపించారని, రావణ్ చెప్పు కూడా చూపించలేదని చెప్పారు. రావణ్‌కు బెయిల్ వచ్చిన ప్రతి సారి మరో కేసులో అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారని వెల్లడించారు.
జైలులో ఉన్న రావణ్‌పై జనసేన కార్యకర్తలు దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లు ఏమైనా టీడీపీ, జనసేన ఆఫీసులా అని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అరాచకాలు మొదలు పెట్టిందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కానీ, కక్ష సాధింపు చర్యలు చేపట్టడం తగదని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వంలో శవాన్ని డోర్ డెలివరీ చేశారని, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో శవాన్ని బూడిద చేసి మాయం చేశారని అన్నారు. ప్రతిపక్షం నుంచి కాకుండా అధికార పక్షం నుంచే అరాచకాలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, ప్రభుత్వమే న్యాయ వ్యతిరేక చర్యలు చేయడం తగదని పేర్కొన్నారు.

