డిండి ప్రాజెక్టుపై ఈఎన్‌సీ ద్వంద్వనీతి: సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి

కలం, నల్లగొండ బ్యూరో: ఏదుల రిజర్వాయర్ నుంచి నీటి తరలింపు విషయంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనుసరిస్తున్న ద్వంద్వనీతి నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల ప్రజల పాలిట శాపంగా మారిందని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం (Nellikanti Satyam) ఆరోపించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వానికి లేఖ రాశారు. పాలమూరు-రంగారెడ్డి (వట్టెం) ప్రాజెక్టుకు 436 మీటర్ల ఎత్తు నుంచే నీటిని తరలించేలా అవకాశం కల్పించి, డిండి కాలువకు మాత్రం 440 మీటర్ల ఎత్తు నుంచి మాత్రమే నీరు తీసుకునేలా నిబంధనలు మార్చడం ముమ్మాటికీ నల్లగొండ జిల్లాపై జరుగుతున్న కుట్రేనని స్పష్టం చేశారు.

ఈఎన్సీ అధికారులు వట్టెం వైపు 6 మోటార్లకు బదులు 8 మోటార్లు బిగించి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించే అవకాశం కల్పించారని, డిండి (Dindi)కి మాత్రం 436.70 మీటర్లకు బదులు 440 మీటర్ల ఎత్తు నిబంధన తీసుకురావడం వల్ల రోజుకు 6 వేల క్యూసెక్కులకు బదులు కేవలం 1500 క్యూసెక్కుల నీరు మాత్రమే సరఫరా అవుతుందని చెప్పారు. రిజర్వాయర్‌లో నీటి మట్టం 440 మీటర్ల నుంచి 436.70 కు తగ్గినప్పుడు ఈ 1500 క్యూసెక్కుల నీరు కూడా కేవలం 56 రోజులు మాత్రమే డిండి కాలువకు సరఫరా జరిగే అవకాశం ఉందన్నారు. దీనివల్ల ప్రభుత్వం నిర్ణయించిన 30 టీఎంసీలకు బదులు కేవలం 7 టీఎంసీల నీరు మాత్రమే నల్లగొండ జిల్లాకు వచ్చే దుస్థితి ఏర్పడిందని తెలిపారు.

ఈఎన్సీ అధికారుల ఈ తప్పుడు నిర్ణయం వల్ల మునుగోడు, దేవరకొండ తదితర ప్రాంతాల ప్రజలకు సాగు, తాగునీరు అందే అవకాశం లేదని పేర్కొన్నారు. ఫలితంగా రూ.వేల కోట్లు ఖర్చుపెట్టి శివన్నగూడెం వరకు నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ వృథాగా మిగిలిపోయే ప్రమాదం ఏర్పడిందని, నాగర్ కర్నూల్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని 21 మండలాల పరిధిలో ఉన్న 3.61 లక్షల ఎకరాల ఆయకట్టును ఎండబెట్టేందుకు కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ సత్యం (Nellikanti Satyam) మండిపడ్డారు.

Read Also: 26 లక్షల ఉద్యోగానికి గుడ్‌బై.. యువకుడి పోస్ట్ వైరల్!

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>