కలం, ఖమ్మం బ్యూరో : రాజీ మార్గమే రాజ మార్గమనీ, రాజీ మార్గం ద్వారానే ఇరుపక్షాలు విన్ అవుతాయి కాబట్టి కక్షదారులు మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి, తెలంగాణ మీడియేషన్ & ఆర్బిట్రేషన్ కేంద్ర మెంబర్, సూరేపల్లి నంద(Justice Surepalli Nanda) తెలిపారు. శనివారం ఖమ్మం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవా సదన్ నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు హైకోర్టు న్యాయ మూర్తులు, న్యాయవాదుల కోసం 40 గంటల మీడియేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద (Justice Surepalli Nanda) మాట్లాడుతూ కోర్టులలో పెరిగిపోతున్న పెండింగ్ కేసులను తగ్గించాలంటే మీడియేషనే సరైన మార్గమని అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా ఇరు పక్షాలు స్నేహ పూరిత వాతావరణంలో కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. మీడియేషన్ ద్వారా త్వరగా న్యాయం లభించడంతో పాటు ఇరు పక్షాల మధ్య ఉన్న సంబంధాలు పాడవకుండా ఉంటాయని పేర్కొన్నారు. మీడియేషన్ యాక్ట్ ద్వారా ఈ ప్రక్రియకు చట్టబద్ధత కూడా కల్పించడం జరిగింది. కావున న్యాయవాదులకు మీడియేషన్ పై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో 40 గంటల కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, వ్యాపార విభేదాలు, సేవలకు సంబంధించిన కేసులు, చైల్డ్ కస్టడీ, తల్లితండ్రుల మేయింటెనెన్స్ కేసుల వివాదాలు మీడియేషన్ ద్వారా వేగంగా పరిష్కరించుకునే ఆస్కారం ఉంటుందని, క్రిమినల్ కేసులు, తీవ్రమైన ఆరోపణలు ఉన్న కేసులలో మీడియేషన్ చేయడం కుదరదని స్పష్టం చేశారు. మీడియేటర్లు చాలా ఓపికతో ఇరుపక్షాల వాదనలు పూర్తిగా విని, ఇరు పక్షాలకు విన్-విన్ పొజిషన్ ఉండే విధంగా, ఇరు పక్షాలు అంగీకరించేలా సమస్య పరిష్కరించాల్సి ఉంటుందని అన్నారు. అలాగే సెక్షన్ 89 సీపీసీ ప్రకారం మీడియేషన్ ద్వారా పరిష్కృతం అయ్యే కేసులను కోర్టులు రిఫర్ చేస్తే బావుంటుందని ఆశా భావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర హైకోర్టు జడ్జి కె. శరత్ (Justice K. Sarath) మాట్లాడుతూ చిన్న, చిన్న కారణాలతో కేసులు చాలా రోజుల పాటు పెండింగ్ లో ఉంటున్నాయని, అటువంటి కేసులలో లిటిగేషన్ పెంచకుండా మీడియేషన్ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10 శాతం మేరకు కేసులు మీడియేషన్ ద్వారా పరిష్కారం అవుతున్నాయని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ స్టేట్ సెక్రటరీ పంచాక్షరీ మాట్లాడుతూ మీడియేషన్ నిర్వహించేందుకు ఆసక్తి కల్గిన 600 మంది న్యాయవాదులకు ఇప్పటివరకు శిక్షణ అందించామని, నేడు మరో 50 మంది న్యాయవాదులకు శిక్షణ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 19 సంవత్సరాల అనుభవం గల మాస్టర్ ట్రైయినర్ లతో న్యాయ వాదులకు శిక్షణ అందిస్తున్నామని అన్నారు.
Read Also: ముడి చమురుపై భారత్ కీలక నిర్ణయం
Follow Us On : WhatsApp

