కలం, కరీంనగర్ బ్యూరో: కార్ల్ మార్క్స్ (Karl Marx) కార్పొరేట్, పెట్టుబడిదారుల గుండెల్లో గునపం లాంటి మహోన్నతమైన వ్యక్తి అని సీపీఐ సీనియర్ నాయకుడు చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. సీపీఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో మంగళవారం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో కారల్ మార్క్స్ 209వ జయంతి వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి (Chada Venkata Reddy) మాట్లాడుతూ .. 65 సంవత్సరాలు జీవించిన మార్క్స్ మొత్తం జీవితాన్ని మానవజాతికి వారి అధ్యయనానికే వెచ్చించారని గుర్తు చేశారు. మానవసమాజం స్థూలంగా ఆదిమ, బానిస, ఫ్యూడల్,పెట్టుబడిదారీ యాజమాన్య పద్ధతుల్లోకి మారే విధానాన్ని వివరించారని చెప్పారు.
సోషల్ వ్యవస్థతో దోపిడీలేని సమాజం
పెట్టుబడిదారీ సమాజంలో ఉత్పత్తి పెరుగుదలకు ఉత్పత్తి సాధనాలు, భూమి, యంత్రాలు వగైరా వనరులు ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యంలోకి వెళ్లినప్పుడు సామాజిక విప్లవం ద్వారా సోషలిస్టు వ్యవస్థ ద్వారా దోపిడీలేని వ్యవస్థను సాధించడం అనివార్యమని మార్క్స్ నిరూపించాడని గుర్తు చేశారు. మార్క్స్ వివిధ దశల్లో ఈ మార్పులకు కారణాలను విశ్లేషించారన్నారు. నేడు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు, ఆటంకాలను పరిశీలించాలని కోరారు.
ప్రపంచ శ్రామికోద్యమ చరిత్రంతా పరిశీలిస్తే అనేక సందర్భాలలో ఉద్యమం దెబ్బతినటం, తిరిగి పుంజుకోవటం, రెట్టింపు బలంతో ముందుకు సాగటం గమనించాలని కార్మిక, కమ్యూనిస్టు శ్రేణులకు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాపితంగా కారల్ మార్స్ రచనల వల్ల అనేక దేశాల కార్మిక వర్గం దోపిడీ నుండి విముక్తి పొందుతున్నారని, కార్మిక లోకానికే కాకుండా ప్రజల జీవన విధానాలపై కూడా ఆయన రచనల ప్రభావం ఉందని కొనియాడారు.
కమ్యూనిస్టు సిద్ధాంతం అజేయం
ప్రస్తుతం దేశంలో వామపక్షాలు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయని చాడ పేర్కొన్నారు. కానీ కమ్యూనిస్టు సిద్దాంతం అజేయమైందన్నారు. ఏదిఏమైనా ఓట్ల రాజకీయ ప్రక్రియలో ఆటుపోట్లు సహజమని..వాటిని ఎదుర్కోని మళ్లి పుంజుకునేందుకు కృషి జరగాలన్నారు. అందుకు తగిన చర్చలు సాగుతాయన్నారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటికరణ విధానాలతో పెట్టుబడి దారుల ఆస్తులు ఓవైపు పెరుగుతూ పోతుంటే పేదవాడు మరింత పేదవాడుగా మారుతున్నాడని అన్నారు.
ఈ సందర్బంలో వామపక్ష శక్తులు, అభ్యుదయ వాదులు, ప్రజాతంత్ర వాదులు ఒక వేదిక పైకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పని చేసిందనేది స్పష్టమైందన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కండ్ల ముందే నీటి పాలవుతుందని ఈ పరిస్థితిల్లో రాష్ట్ర ప్రభుత్వం తడిసిన దాన్యాన్ని, మక్కలను కొనుగోలు చేయాలని చాడ వెంకటరెడ్డి (Chada Venkata Reddy) కోరారు.
Read Also: కేరళం సీఎం ఎవరు? రేసులో ముగ్గురు హేమాహేమీలు
Follow Us On : WhatsApp

