కలం, కరీంనగర్ బ్యూరో: ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సీపీఐ (CPI) జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలో CPI మండల సమితి ఆధ్వర్యంలో శనివారం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఉపాధి హామీ పని ప్రదేశంలో ఎండా కాలంలో కనీస సౌకర్యాలైన తాగునీరు, మెడికల్ కిట్టు, టెంటు, పారా, గడ్డపార వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉపాధి కూలీలకు ఇస్తామన్న ఏడాదికి రూ.12 వేలు చెల్లించాలని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. తిరిగి పాత పద్ధతిలోనే ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలన్నారు.
రోజు రూ.600 చొప్పున ఇవ్వాలి..
ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలను రెండు పూటలు ఫోటో తీయాలని ఆలోచనను విరమించుకోవాలని పంజాల శ్రీనివాస్ సూచించారు. ఉపాధి కూలీలను ఆదుకునేందుకుప్రభుత్వం 200 రోజులు పని కల్పించి రోజు కూలి రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సవరించినవ్యవసాయ కార్మికుల వేతనాలను అమలు చేసి గ్రామ సభలు నిర్వహించి.. పెరిగిన కూలి రేట్లను ప్రచారం చేయాలని కోరారు. 50 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు రూ.7500 పింఛన్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, మండల కార్యదర్శి రవీందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు మచ్చ రమేష్, మండల నాయకులు వేముల మల్లేశం, ఎలిగేటి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

