Mobile Popup Ad
Mobile Popup Ad

ఇండ్ల స్థలాల పంపిణీలో ప్రభుత్వం విఫలం : తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

కలం, హనుమకొండ : ఇండ్ల స్థలాల పంపిణీలో ప్రభుత్వ వైఫల్యంతోనే పేదలు భూపోరాటాలు నిర్వహిస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ (Hanumakonda) కలెక్టరేట్ ఎదుట శుక్రవారం సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు (Thakkalapally Srinivasa Rao) మాట్లాడుతూ.. భూ పోరాటాల ద్వారా ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకుని దశాబ్దాలుగా నివాసముంటున్న, నిరుపేదలైన ప్రజలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.

ఒకవైపు పేదలకు గూడు లేక ఇబ్బంది పడుతుంటే, మరోవైపు విలువైన ప్రభుత్వ భూములు ల్యాండ్ మాఫియా పరం అవుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి హనుమకొండ (Hanumakonda) జిల్లాలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇండ్ల స్థలాల కోసం, పక్కా ఇండ్ల నిర్మాణం కోసం ఏండ్ల తరబడి పేదలు పోరాడుతూనే ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా పేదలు, బడుగు బలహీన వర్గాలు నివసించేందుకు స్థలం లేక, పక్కా ఇల్లు లేక, దుర్భర జీవితం గడుపుతున్నారని అన్నారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితి దాపురించిందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్ల స్థలంతో పాటు పక్కా ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిందని ,కానీ ఇంకా అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి పేద ప్రజలను ఆదుకోవాలని కోరారు.

పేదలకు, ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారికి ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, సీపీఎం జిల్లా నాయకులు ఎం. చుక్కయ్య అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో ఆయా పార్టీల జిల్లా కార్యదర్శులు, కర్రె బిక్షపతి, జి.ప్రభాకర్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యురాలు మండ సదాలక్ష్మి, నాయకులు పాల్గొన్నారు.

Read Also: తెలంగాణలో మాఫియా రాజ్యమేలుతోంది: కేటీఆర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>