కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) కమిషనరేట్ పరిధిలోని పోలీస్ సిబ్బంది అందరి సంపూర్ణ ఆరోగ్య సమాచారంతో కూడిన ‘హెల్త్ ప్రొఫైల్స్’ సిద్ధం చేస్తున్నట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ (CP Sunil Dutt) వెల్లడించారు. ఖమ్మం ఏఆర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో హైదరాబాద్ యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత గుండె వైద్య పరీక్షల (ఈసీజీ, టూడీ ఈకో) శిబిరాన్ని సీపీ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన (CP Sunil Dutt) మాట్లాడుతూ… విధినిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే మానసిక, శారీరక ఒత్తిళ్ల వల్ల గుండె జబ్బులు వంటి ప్రాణాంతక సమస్యలు వచ్చే ముప్పు ఉందన్నారు. అలాంటి ముప్పును ముందుగానే గుర్తించి నివారించడానికి ఈ ప్రత్యేక మెడికల్ క్యాంపుల ద్వారా సిబ్బంది అందరికీ హెల్త్ ప్రొఫైల్స్ రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు.
పోలీసు సిబ్బందితో పాటు వారి కుటుంబాల ఆరోగ్య సంరక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అగ్రతాంబూలం ఇస్తుందని సీపీ అన్నారు. సిబ్బంది శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉంటేనే తమ విధులను సక్రమంగా నిర్వహించగలుగుతారని, తద్వారా కుటుంబంలోనూ ప్రశాంతత నెలకొంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.
యశోద ఆస్పత్రి సౌజన్యంతో అత్యంత కీలకమైన ఈసీజీ, టూడీ ఈకో పరీక్షలను ఉచితంగా అందిస్తున్నామని, సిబ్బంది అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ భరత్ రెడ్డి, సీనియర్ మేనేజర్ వినయ్ కుమార్, ఏసీపీ మహేష్, ఏఆర్ ఏసీపీ సుశీల్ సింగ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Also: లబ్ధిదారులు కాదు..ఇకపై బస్సుల యజమానులు!
Follow Us On : WhatsApp

