కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల పరిధిలోని బచ్చోడు (Bachodu) గ్రామంలో ఐదుగురు యువకులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ తీవ్ర సంచలనం సృష్టించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇటీవల మృతిచెందిన ఓ వ్యక్తి కర్మకాండల కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి వచ్చిన ఐదుగురు యువకులు మద్యం మత్తులో తీవ్ర అరాచకానికి ఒడిగట్టారు.
కార్యక్రమం ముగిసిన అనంతరం బచ్చోడు గ్రామ బస్టాండ్ సెంటర్‌లో సదరు యువకులు ఆటో ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వివాదం చెలరేగడంతో వారు ఆటో డ్రైవర్‌పై ఇనుప రాడ్లతో దాడికి దిగారు. అక్కడే ఉన్న చింతల ప్రశాంత్ అనే యువకుడు ఆ గొడవను ఆపేందుకు ప్రయత్నించగా, అతనిపై మొదటగా ఇనుప రాడ్డుతో విరుచుకుపడ్డారు. ఆపై గొడవను అదుపు చేసేందుకు వచ్చిన సుమారు 11 మంది గ్రామస్తులపై ఇటుక రాళ్లు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనతో బస్టాండ్ ప్రాంగణమంతా రక్తసిక్తమైంది.
దాడి అనంతరం నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా, వారిలో ఒకరిని స్థానిక గ్రామస్తులు పట్టుకుని చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు. మిగతా నలుగురు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్సై కూచుపూడి జగదీశ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ దారుణ ఘటనతో బచ్చోడు గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
కేవలం ఐదుగురు యువకులు సుమారు 60 మంది గ్రామస్తులను భయబ్రాంతులకు గురిచేయడం, ఇంతటి దారుణానికి ఒడిగట్టడం కేవలం మద్యంతోనే సాధ్యం కాదని గ్రామస్తులు బలంగా అనుమానిస్తున్నారు. సదరు యువకులు గంజాయి గానీ లేదా మరేదైనా తీవ్రమైన మత్తు పదార్థాలు గానీ సేవించి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. గ్రామంలో భయాందోళనలు సృష్టించి రక్తపాతానికి కారణమైన ఐదుగురు నిందితులపై చట్టరీత్యా తీవ్రమైన కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

