కలం, వెబ్ డెస్క్: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో (AP Local Body Elections) భాగంగా గురువారం ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లా పరిషత్తులున్నాయి. 659 జడ్పీటీసీ స్థానాలకు గాను ఇప్పటికే 77 ఏకగ్రీవం కావడంతో మిగిలిన 582 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. 9,821 ఎంపీటీసీ స్థానాలుండగా 2,051 ఏకగ్రీవం అయ్యాయి. 7,767 స్థానాలకు మరికాసేపట్లో పోలింగ్ జరగబోతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ స్థానాల కోసం 2,169 మంది, ఎంపీటీసీ స్థానాల కోసం 18,843 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.61 కోట్ల మంది ఓటర్లు ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల భవిష్యత్తును తేల్చబోతున్నారు. ఇప్పటికే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి పార్టీలే అత్యధిక స్థానాలు గెల్చుకున్న విషయం తెలిసిందే.
ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు..
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం భారీగా ఏర్పాట్లు చేసింది. మొత్తం 31,460 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటిలో 8,904 సమస్యాత్మక, 7,160 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించింది. 16,064 పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను బిగించింది. 6 వేల కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, 6,507 కేంద్రాల్లో వీడియోగ్రఫీ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణల దృష్ట్యా బందోబస్తును మరింత కట్టుదిట్టం చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలను ఆదేశించింది.

