కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న భారీ ఫ్లెక్సీలు వివాదానికి దారితీస్తున్నాయి. ఫ్లెక్సీల ఏర్పాటుకు మున్సిపాలిటీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ప్రధాన రహదారులు, కూడళ్లలో ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ఫ్లెక్సీలు (Unauthorized Flexies) ఏర్పాటు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
దీంతో నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయా? అనే ప్రశ్నలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 1న చెన్నై, చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా శివాజీ చౌక్ నుంచి బైలు బజార్, ఖానాపూర్ రోడ్డు, భైంసా రోడ్డు వైపు పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు ప్రారంభోత్సవం రోజే తొలగించారు.
దీంతో అక్రమ ఫ్లెక్సీల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే తాజాగా గురువారం మరో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రధాన కూడళ్లలో భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. గతంలో అనుమతులు లేని ఫ్లెక్సీలను తొలగించిన అధికారులు.. ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నిబంధనలు అందరికీ ఒకేలా ఉండవా?
మున్సిపాలిటీ పరిధిలో ఫ్లెక్సీల ఏర్పాటుకు నిబంధనలు, అనుమతులు తప్పనిసరిగా ఉంటే వాటిని ఉల్లంఘించిన వారిపై ఒకే విధమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రజలు అంటున్నారు. గతంలో తొలగించిన ఫ్లెక్సీలతో పాటు ప్రస్తుతం ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించి నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. గతంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ప్రజా ప్రతినిధులను ఆహ్వానించకపోవడం వల్లే ఆ మాల్‌కు సంబంధించిన ఫ్లెక్సీలను అధికారులు తొలగించారనే ప్రచారం జరుగుతోంది.
అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేకపోవడంతో ఈ ప్రచారంపై స్పష్టత రావాల్సి ఉంది. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని ప్రజలు చెబుతున్నారు. ఫ్లెక్సీల ఏర్పాటుపై మున్సిపల్ అధికారులు స్పష్టమైన విధానం ప్రకటించి, అనుమతి ఉన్నవి.. అనుమతి లేనివి గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఫ్లెక్సీల తొలగింపు విషయాన్ని టీపీఓ అనురాధ, టీపీఎస్ సాయి లను సంప్రదిస్తే ఇద్దరు అధికారులు వేరు వేరు సమాధానాలు చెబుతున్నారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తామని చెబుతున్న టిపిఓ మున్సిపల్ కమిషనర్ నుండి ఎలాంటి ఆదేశాలు రాలేవని వచ్చిన తర్వాత తొలగిస్తామని టీపీఎస్ సమాధానం ఇస్తున్నారు.
ఫ్లెక్సీల తొలగింపుపై అధికారుల ‘భిన్న’ మాటలు..
అయితే అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారంలో మున్సిపల్ అధికారుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్లెక్సీల తొలగింపుపై టీపీఓ అనురాధ, టీపీఎస్ సాయిని సంప్రదించగా.. ఇద్దరు అధికారులు వేర్వేరు సమాధానం ఇచ్చారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తామని టీపీఓ అనురాధ స్పష్టం చేయగా, టీపీఎస్ సాయి మాత్రం మున్సిపల్ కమిషనర్ నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని, ఆదేశాలు వచ్చిన తర్వాత ఫ్లెక్సీలను తొలగిస్తామని సమాధానం ఇచ్చారు.

