కలం, మహబూబ్నగర్ బ్యూరో: దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఎన్నికల సంఘం స్వతంత్రత, విశ్వసనీయతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam) అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు, డీసీసీ అధ్యక్షుడు ఏ. సంజీవ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సోమవారం మహబూబ్నగర్ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు భారీగా మహాధర్నా(Congress Protest) నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి యెన్నం శ్రీనివాస్ రెడ్డితో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకురావడం రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తిపై అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. గతంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ప్రధానమంత్రి, లోక్సభ ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ఎంపిక కమిటీ ఏర్పాటు కాగా, అనంతరం పార్లమెంటు చట్టం ద్వారా న్యాయవ్యవస్థ ప్రాతినిధ్యాన్ని తొలగించేలా మార్పులు చేశారని ఆరోపించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో టీ.ఎన్. శేషన్ వంటి ప్రధాన ఎన్నికల కమిషనర్లు స్వతంత్రంగా వ్యవహరించి ఎన్నికల వ్యవస్థలో కీలక సంస్కరణలు తీసుకొచ్చారని యెన్నం శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేశారు. దేశ యువత నిష్పక్షపాత ఎన్నికలను కోరుకుంటున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఓటర్ల జాబితా రూపకల్పన, నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు.
దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పగిస్తూ, తమకు అనుకూలమైన వ్యక్తులకు కీలక పదవులు కట్టబెడుతోందని ఆరోపించారు. కీలక రాజ్యాంగ, పరిపాలనా వ్యవస్థల్లో అనుకూల వ్యక్తులను నియమిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువులాంటి ఎన్నికల సంఘంపై కూడా రాజకీయ ప్రభావం చూపే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. ఈ మహాధర్నాలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, సిరాజ్ ఖాద్రీ, జిల్లా కాంగ్రెస్ నేతలు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, బుద్దారం సుధాకర్ రెడ్డి, దోమ పరమేశ్వర్, రాములు యాదవ్, ఎస్సీ సెల్ చైర్మన్ పసుల రాజు, ఎస్టీ సెల్ లింగం నాయక్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

