వెల్టూరుకు త్వరలో‘మండల’ హోదా: మంత్రి పొంగులేటి

కలం, వనపర్తి: వెల్టూరు (Veltoor) గ్రామాన్ని త్వరలో మండల కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొత్త మండలాలు, డివిజన్ల ఏర్పాటుపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

పెద్దమందడి మండలం వెల్టూరులో రూ.12.75 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌, వనపర్తి మండలం చిట్యాల పరిధిలో రూ.10 కోట్లతో నిర్మించనున్న జ్యోతిబా పూలే బాలుర గురుకుల కళాశాల భవనాలకు సోమవారం మంత్రి పొంగులేటి, పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా పొంగులేటి (Minister Ponguleti Srinivas Reddy) మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చేయడంతోపాటు పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

రైతులకు మద్దతు ధర, రైతుభరోసా, రుణమాఫీ, సన్నబియ్యానికి రూ.500 బోనస్‌ వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.నిరుద్యోగులకు ఇప్పటికే వేలాది ఉద్యోగాలు కల్పించామని, మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు తెలిపారు. మహిళా సంఘాలకు సున్నా వడ్డీకే రుణాలు అందిస్తున్నామని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, తెల్లరేషన్‌ కార్డులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు.

మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. వెల్టూరుకు రూ.12.75 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. వెల్టూరు పెద్ద గ్రామమని, మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>