కలం, మెదక్ బ్యూరో : ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని (Husnabad) మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన (Congress Protest) కార్యక్రమం నిర్వహించారు. బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో జరిగిన ఈ ఆందోళనలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమి ఎంపీలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కడం, వారిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మంత్రి విమర్శించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్ల జాబితా నుంచి పెద్ద ఎత్తున ఓట్లను తొలగిస్తూ అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ కేంద్రంలోని బీజేపీకి ఏజెంట్లా వ్యవహరిస్తూ ఎన్నికల వ్యవస్థ పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కోల్పోయిందని మంత్రి పేర్కొన్నారు. సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం, కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

