కలం, వనపర్తి: విశ్వశాంతి, లోకకల్యాణాన్ని ఆకాంక్షిస్తూ వనపర్తి (Wanaparthy) జిల్లా కేంద్రంలో 15 రోజుల పాటు అయుత చండీ, అతిరుద్ర మహాయాగాలు, మహాభిషేకాలు, యజ్ఞయాగాదులు నిర్వహించనున్నట్లు శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ తెలిపారు.
శ్రీకృష్ణ కాలచక్రం ఆధ్వర్యంలో ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు మర్రికుంట పాలకేంద్రం వెనుక వైష్ణవ వాయతనంలో అయుత చండీ, అతిరుద్రం, శ్రీసీతారామ సామూహిక పీఠాభిషేకంతో పాటు 92వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
స్వామీజీ దివ్య మంగళాశీస్సులతో జరిగే ఈ మహోత్సవాల్లో పురుషసూక్త పూర్వక మహాగణపతి, మహాసుదర్శన, లక్ష్మీనారాయణ సహిత శ్రీమద్భాగవత పారాయణం, వివిధ హోమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు తొలగి, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని యాగాల్లో సంకల్పం చేయనున్నట్లు తెలిపారు.
బాల్య వివాహాల నిర్మూలన, మహిళా సాధికారత, సమాజంలో ధర్మాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామీజీ ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు. సమాజానికి మంచి సందేశాన్ని అందించే ఈ మహోత్సవాలను భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీకృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆకాంక్షించారు.

