కలం, నిజామాబాద్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం సర్ పేరుతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఓట్లను తొలగించే కుట్రకు పాల్పడుతుందని కార్పొరేషన్ డిసిసి అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) ఆరోపించారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బిఎల్ఎ సూపర్వైజర్ ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కొనసాగుతున్న SIR ప్రక్రియ కోసం కాంగ్రెస్ పార్టీ నుండి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం లోని 301 బూత్ లకు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించినట్లు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు.
ప్రతి రెండు డివిజన్ లకు ఒక సూపర్వైజర్ ను అంటే సుమారు 10 బూత్ ల చొప్పున నియమించామన్నారు. నియోజకవర్గ ERO కో ఆర్డినేటర్ ను నియమించినట్లు వివరించారు. ఎక్కడైతే కాంగ్రెస్ అనుకూలమైన ఓట్లు ఉంటాయో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని, కావున బూత్ లెవెల్ ఏజెంట్లు ఎక్కడ కూడా ఓట్లు డిలీట్ కాకుండా చూసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ ఫామ్ లు అందేలా చూసి వాటిని ఎలా నింపాలో కూడా చెప్పాలని, ఫామ్ నింపే ప్రక్రియలో ఇబ్బందులు ఉన్నవారికి సహాయం చేయాలని సూచించారు.
బిఎల్ఓ లకు ఇన్‌చార్జులుగా నియమించిన వారు.. వారికి కేటాయించిన డివిజన్ లో పర్యవేక్షించాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, అర్బన్ SIR కో ఆర్డినేటర్ ఆకుల లలిత, కార్పొరేషన్ డీసీసీ ఉపాధ్యక్షుడు విజయపాల్ రెడ్డి, సలీం, కోశాధికారి సకినాల శివ, జెండా గుడి చైర్మన్ ప్రమోద్, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

