Mobile Popup Ad
Mobile Popup Ad

సచిన్ టెస్ట్ రికార్డుకు చేరువలో జో రూట్

కలం, స్పోర్ట్స్: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (Joe Root) ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌లో కొత్త చర్చకు కారణమయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో పెద్ద స్కోర్లు చేయకపోయినా, ఓ అరుదైన మైలురాయికి మరింత చేరువయ్యాడు. ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టులో రూట్ తొలి ఇన్నింగ్స్‌లో 21, రెండో ఇన్నింగ్స్‌లో 18 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోయింది. సిరీస్‌ను కూడా 1-2తో కోల్పోయింది. ఈ ఫలితం కంటే రూట్ కెరీర్ రికార్డే ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తోంది.

సచిన్ ఒక్కడే ముందు..

ఈ రెండు ఇన్నింగ్స్‌తో రూట్ టెస్ట్ పరుగుల సంఖ్య 14,114కు చేరింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు ఇప్పటి వరకు ఒక్కరే. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన కెరీర్‌లో 15,921 టెస్ట్ పరుగులు చేశాడు. ఆ రికార్డును అందుకోవాలంటే రూట్‌కు ఇంకా 1,807 పరుగులు అవసరం. గతంలో రికీ పాంటింగ్, జాక్వెస్ కలిస్, కుమార సంగక్కర, అలిస్టర్ కుక్ కూడా సచిన్ రికార్డును చేరుకుంటారని భావించారు. చివరకు ఆ లక్ష్యానికి దూరంగానే నిలిచిపోయారు.

నిలకడగా రూట్ పరుగులు..

అయితే రూట్ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. 35 ఏళ్ల వయసులో అతను సచిన్ అదే వయసులో చేసిన పరుగుల కంటే ఎక్కువ పరుగులు చేశాడు. మరోవైపు సచిన్ 16 ఏళ్లకే టెస్ట్ అరంగేట్రం చేశాడు. రూట్ మాత్రం 21 ఏళ్ల వయసులో టెస్ట్ క్రికెట్‌లోకి వచ్చాడు. అయినప్పటికీ గత పదేళ్లుగా నిలకడగా పరుగులు చేస్తూ ఆ లోటును భర్తీ చేశాడు. ఇంగ్లండ్ గత కొన్నేళ్లుగా ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడటం కూడా రూట్‌కు కలిసి వచ్చింది. అతను చాలా తక్కువ మ్యాచ్‌లనే మిస్ అయ్యాడు.

ఎక్కువ కాలం ఫామ్ కొనసాగిస్తున్న రూట్..

రూట్ కెరీర్‌లో మరో ప్రత్యేకత ఫామ్ ఎక్కువ కాలం కొనసాగిస్తూ వస్తుండటం. ముఖ్యంగా 2021 తర్వాత అతను నిలకడగా పరుగులు చేస్తున్నాడు. కొన్ని గణాంకాల్లో సచిన్ ఇంకా ముందే ఉన్నాడు. అతడి బ్యాటింగ్ సగటు ఎక్కువ. తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే కీలక మైలురాళ్లు అందుకున్నాడు. అర్ధ సెంచరీలను సెంచరీలుగా మార్చిన సందర్భాలు కూడా ఎక్కువ. అయినా రూట్‌కు ఇప్పుడు మంచి అవకాశం కనిపిస్తోంది. ఇంగ్లండ్‌కు రానున్న రెండు సీజన్లలో వరుస టెస్ట్ మ్యాచ్‌లు ఉన్నాయి.

వాటిపైనే ఆధారం..

ప్రస్తుత పరుగుల వేగం కొనసాగితే మరో 18 నుంచి 21 టెస్టుల్లో సచిన్ రికార్డుకు చేరుకునే అవకాశం ఉంది. అయితే ఆ రికార్డు నిజంగా బద్దలవుతుందా లేదా అన్నది రూట్ ఫిట్‌నెస్, ఫామ్, ఎంపిక వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మాత్రం టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు కోసం జో రూట్ చేస్తున్న పోరాటం ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>