కలం, మహబూబ్ నగర్ బ్యూరో : జూనోసిస్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, దీనిపై ప్రజలలో అవగాహన కల్పించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) పిలుపునిచ్చారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అధికారుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే జూనోసిస్ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారా అనేక ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చని ఆమె పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో పశుసంవర్ధక, వైద్య ఆరోగ్య, స్థానిక సంస్థలు, రెవెన్యూ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
జూనోసిస్ వ్యాధుల నివారణలో ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత కీలకమని ఆమె అన్నారు. జంతువుల నుంచి మనుషులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంక్రమించే వ్యాధులను జూనోసిస్ వ్యాధులు అంటారని కలెక్టర్ వివరించారు. రేబీస్, బ్రూసెల్లోసిస్, లెప్టోస్పిరోసిస్, ఆంథ్రాక్స్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ వంటి వ్యాధులు ప్రధాన జునోసిస్ వ్యాధులుగా గుర్తించబడినట్లు ఆమె తెలిపారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, అసిస్టెంట్ కలెక్టర్ (అండర్ ట్రైనీ) సాయి శివాని, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా. స్వామి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

