కలం, వెబ్ డెస్క్: ప్రశ్నించే గొంతును అణచలేరని.. ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) స్పష్టం చేశారు. ఏ తప్పు చేయకపోయినా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో తనకు, తన కుటుంబానికి, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు సీఐడీ (CID) నోటీసులు ఇవ్వడం ఎంతో బాధ కలిగించిందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే కారణంతో బెదిరింపులకు గురిచేయడం తగునా? అని ప్రశ్నంచారు. రాజకీయాలు తనపై చేయాలి కానీ. తన కుటుంబాన్ని, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం? అని ప్రశ్నంచారు.
“రేవంత్ రెడ్డి గారు.. నన్ను లక్ష్యంగా చేసుకోండి. నాపై కేసులు పెట్టండి. నాకు నోటీసులు ఇవ్వండి. కానీ నా కుటుంబాన్ని, నా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం మాత్రం బాధాకరం. అయినా సరే నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ఎన్ని నోటీసులు ఇచ్చినా.. నేను వెనక్కి తగ్గను. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాను.. నిలదీస్తూనే ఉంటాను. ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు.. ప్రజల కోసం చేసే బాధ్యత” అని కౌశిక్ రెడ్డి ట్వీట్ చేశారు.
కాగా, కాసేపటిక్రితమే హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి (Kaushik Reddy) సీఐడి నోటీసులు ఇచ్చింది. సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న సమయంలో విధులకు ఆటంకం కలిగించడంతో పాటు, అనుచరులతో కలిసి చట్టవిరుద్ధంగా గుంపుగా చేరి రహదారిపై కూర్చొని ట్రాఫిక్‌ను అడ్డుకున్నట్లు ఆరోపణలపై నోటీసులు జారీ చేసింది. కరీంనగర్ సీపీ గౌస్ ఆలంపై కుడా సోషల్ మీడియాలో దూషణలు చేసినట్లు నోటీసులో తెలిపింది. ఏప్రిల్ 4న హైదరాబాద్ లోని లక్డికాఫుల్ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరవాలని నోటీసులో పేర్కొంది.
Read Also: శీతల మాతా ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది భక్తులు మృతి
Follow Us On : WhatsApp

