కలం, నిర్మల్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంకల్ప్ ప్రాజెక్టు (Sankalp Project) కింద ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రి చిన్నపిల్లల విభాగం ఎంపిక కావడం శుభపరిణామమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో IIHFW చైర్పర్సన్ డా. కవిత రెడ్డి సీలంతో కలిసి వైద్య శాఖ అధికారులతో సంకల్ప్ ప్రాజెక్టు, రిమ్స్‌లో వైద్య సేవలు, అందుబాటులో ఉన్న వసతులు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సంకల్ప్ ప్రాజెక్టు ద్వారా రిమ్స్ ఆసుపత్రిలోని చిన్నపిల్లల విభాగంలో వైద్య సేవలు మరింత మెరుగుపడటంతో పాటు అందుబాటులో ఉన్న వసతులు, మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చెందనున్నాయని తెలిపారు. చిన్నారులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రాజెక్టు అమలుతో చిన్నపిల్లల విభాగంలో వైద్య సేవల నాణ్యత మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ డా. రాథోడ్ జైసింగ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. సాధన, ఇతర వైద్య బృందం, సిబ్బంది పాల్గొన్నారు.

