కలం, మహబూబ్ నగర్ బ్యూరో/వనపర్తి: రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఏకైక బీసీ మహిళ మంత్రి అయిన కొండా సురేఖ (Konda Surekha) ను బర్తరఫ్ చెయ్యడాన్ని బీసీ సమాజ్ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ పార్టీలో బీసీ వర్గాలకు న్యాయం జరగదని, బీసీ బిడ్డ అయిన కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడం అన్యాయమని, కాంగ్రెస్ పార్టీలో రెడ్లకో న్యాయం బీసీలకో న్యాయమా అని బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడల శ్రీనివాస్ సాగర్ గురువారం ఒక ప్రకటనలో నిలదీశారు.
గతంలో సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి లపై చర్యలు ఉండవా, రాహుల్ గాంధీ చెప్పే సామాజిక న్యాయం ఇదేనా అని ప్రంచారు. బీసీలపై రాజకీయ వివక్షను ఖండిస్తూ బీసీల ఉసురు పోసుకుంటే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవన్నారు. సామాజిక న్యాయం కోసం బీసీలంతా ఏకతాటి పైకి వచ్చి పోరాడుదామని పిలుపునిచ్చారు. అగ్రవర్ణ పార్టీలకు తగిన బుద్ధి చెప్పేందుకు బీసీ సమాజం ముందుకు రావాలని శ్రీనివాస్ సాగర్ కోరారు.
సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం హేయం : మోహన్‌కుమార్ యాదవ్
కొండా సురేఖను రాష్ట్ర మంత్రి పదవి నుంచి తొలగించడం హేయమైన చర్య అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చవ్వ మోహన్‌కుమార్ యాదవ్ అన్నారు. గురువారం వనపర్తిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ పద్మశాలి సామాజికవర్గానికి చెందిన మహిళా నాయకురాలైన కొండా సురేఖ 1994లో ఎంపీపీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని మోహన్‌కుమార్ యాదవ్ తెలిపారు.
రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించడం బీసీలు, మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అహంకార ధోరణితోనే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించారని ఆయన విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించిన వ్యవహారాన్ని బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు.
మహిళా నాయకురాలిని అవమానించేలా వ్యవహరించడం సరికాదని, ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. బీసీ, బహుజన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆ పదవిలో కొనసాగేందుకు నైతిక హక్కు లేదని మోహన్‌కుమార్ యాదవ్ విమర్శించారు. ఈ అంశంలో బీజేపీ జోక్యం చేసుకుని ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకునేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.

