కలం, ఆదిలాబాద్: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా (Indiramma Insurance) పథకం దరఖాస్తుల నమోదు ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం అమలుపై గురువారం బేలా మండల ఎంపీడీఓ కార్యాలయం నుండి జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ భీమా పథకం ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించిన తర్వాత ‘ఎడిట్’(సవరణ) ఆప్షన్ ఉండదని, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఏమాత్రం తప్పులు జరగకుండా వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు.
పొరపాట్లు జరిగితే భవిష్యత్తులో లబ్ధిదారులకు బీమా క్లెయిమ్ అందడంలో ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరించారు. శిబిరాలు ప్రారంభించే ముందే లాగిన్‌లతో తప్పనిసరిగా టెస్ట్ రన్ నిర్వహించి, గ్రామ పంచాయతీలు, మండలాల పేర్లు సరిగ్గా కనిపిస్తున్నాయో లేదో సరిచూసుకోవాలని సూచించారు. ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే తక్షణమే తెలియజేయాలనీ, నెట్‌వర్క్ సమస్య ఉన్న గ్రామాల్లో కాకుండా, తొలుత నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న పంచాయతీల్లో శిబిరాలు ప్రారంభించి, సోమవారం నాటికి పూర్తిస్థాయిలో నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
పెద్ద పంచాయతీలు, పట్టణ వార్డుల్లో రద్దీని నివారించేందుకు రెండు, మూడు చోట్ల శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దరఖాస్తుల ప్రింట్ అవుట్లు, స్కానింగ్ అవసరం లేదని, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లేదా మొబైల్ యాప్ ద్వారా వివరాలు నమోదు చేసి పీడీఎఫ్ రూపంలో భద్రపరుచుకోవచ్చని వివరించారు. అయితే ప్రతి శిబిరంలో ‘క్యాంప్ లెవల్ రిజిస్టర్’ను పక్కాగా నిర్వహించి, ట్రాన్సాక్షన్ ఐడీ, ఎఫ్‌ఎస్‌సీ నంబర్, లబ్ధిదారు, నామినీ వివరాలతో పాటు లబ్ధిదారు, క్యాంప్ అధికారి, సూపర్‌వైజర్ సంతకాలు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు.
కుటుంబానికి ఆధారమైన 18 నుంచి 59 ఏళ్ల వయసు గల వ్యక్తిని అర్హుడిగా గుర్తించాలని, వారికి ఇప్పటికే రైతు బీమా లేదా ఇతర ప్రభుత్వ బీమా పథకాలు ఉన్నాయో లేదో పక్కాగా నిర్ధారించుకుని నమోదు చేయాలన్నారు. మీసేవ కేంద్రాలను సైతం వినియోగించుకోవచ్చని, ఈ సేవలకు లబ్ధిదారుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకూడదని తేల్చిచెప్పారు.

