ఆసరా పింఛన్లలో అర్హులకు అన్యాయం : సోహన్ సింగ్

కలం, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం, కరీంనగర్ నగరపాలక సంస్థ పాలకవర్గం వితంతువులు, దివ్యాంగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అర్హులైన పింఛన్‌దారులకు అన్యాయం చేస్తున్నాయని బీఆర్ఎస్ నాయకుడు, న్యాయవాది సోహన్ సింగ్ (Sohan Singh) విమర్శించారు. నగరంలోని 66వ డివిజన్‌లో ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వితంతువులు, దివ్యాంగుల్లో కొందరికే పింఛన్లు మంజూరు చేసి, మిగిలిన అర్హులను విస్మరించారని మండిపడ్డారు. ఈ సమస్యపై గురువారం నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్‌ను కలిసి బీఆర్ఎస్ పార్టీ తరఫున వినతిపత్రం అందజేశారు.

విచారణ పేరిట కోతలు సరికాదు

ఈ సందర్భంగా సోహన్ సింగ్ మాట్లాడుతూ.. పింఛన్ల మంజూరు కోసం విచారణకు వచ్చిన నగరపాలక సంస్థ అధికారులు నిబంధనల పేరుతో అర్హుల దరఖాస్తులను తిరస్కరించడం దారుణమన్నారు. ఒకే ఇంట్లో ఒకరికి వితంతు పింఛన్ వస్తుందనే కారణంతో మరొకరికి రావాల్సిన పింఛన్‌ను తిరస్కరించారని తెలిపారు. అలాగే, ఒకరికి వితంతు పింఛన్ అందుతున్న కుటుంబంలో దివ్యాంగులకు కూడా పింఛన్ మంజూరు చేయకుండా దరఖాస్తులను తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ముట్టడికి వెనుకాడబోం

రాష్ట్ర ప్రభుత్వం, నగరపాలక సంస్థ పాలకవర్గం వితంతువులు, దివ్యాంగులను మోసం చేస్తున్నాయని సోహన్ సింగ్ ఆరోపించారు. తిరస్కరించిన దరఖాస్తులను పునఃపరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని అసిస్టెంట్ కమిషనర్‌ను కోరారు. అధికారులు స్పందించకపోతే పింఛన్లు అందని బాధితులందరినీ కలుపుకొని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>